ఢిల్లీలో డిఎల్ మకాం: సోనియాతో భేటీకి యత్నాలు

తాను అపాయింట్‌మెంట్ కోరానని, అపాయింట్‌మెంట్ ఇస్తే సోనియాను, ఆజాద్‌ను కలుస్తానని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. వారిని కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరిస్తానని, అలా చెప్పకపోతే తప్పు చేసినవాడిని అవుతానని ఆయన అన్నారు. ఇప్పుడైతే పరిస్థితి బాగానే ఉందని, ఉప ఎన్నికల వల్ల యుద్ధవాతావరణం నెలకొని ఉందని ఆయన చెప్పారు.
తనను పిలిస్తే ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తానని, ఉప ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పలేమని ఆయన అన్నారు. జయాపజయాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు. తమ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఇప్పుడే కలిశారని, విహెచ్‌ను శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు ప్రచారం కోసం పిలిచారని, అలా పిలిస్తే తాను కూడా వెళ్తానని అన్నారు. కడప లోకసభ స్థానంలో డిపాజిట్ కోల్పోయాడు, ఏం పిలుస్తామని కొంత మంది తనపై అనుకుంటూ ఉండవచ్చునని ఆయన అన్నారు.
గత కొంత కాలంగా డిఎల్ రవీంద్రా రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్రంగా మండిపడుతున్నారు. తాను కడప జిల్లాలోని ఉప ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనబోనని, ఫలితాలకు బాధ్యత వహించబోనని అన్నారు. కడప జిల్లాలోని స్థానాలకు కాంగ్రెసు పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిపై బహిరంగ విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో డిఎల్ సమావేశమయ్యారు. ఆ తర్వాత విమర్శలను తగ్గించారు.












Click it and Unblock the Notifications