వైయస్ మాట పాటించండి: జర్నలిస్టులకు రేవంత్ సూచన

Revanth Reddy
హైదరాబాద్: మీడియా స్వేచ్ఛకు సంబంధించి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పిన మాటలను పాటించాలని తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు సూచించారు. మీడియా స్వేచ్ఛపై వైయస్ రాజశేఖర రెడ్డి శానససభలో చేసిన ప్రసంగం సిడీలను ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విడుదల చేశారు. మీడియా స్వేచ్ఛ వేరు, అక్రమాలు వేరని వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారని, సాక్షి మీడియా బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయడం పత్రికా స్వేచ్ఛకు భంగకరమని ఆందోళన చేస్తున్న పాత్రికేయ సంఘాలు ఈ విషయం గుర్తించాలని ఆయన అన్నారు.

ఉద్యోగుల భద్రతకు, వారి జీతభత్యాలకు ఇబ్బంది కలిగినప్పుడు జర్నలిస్టు సంఘాలు పత్రికా యాజమాన్యం మీద, ప్రభుత్వం మీద పోరాడాలని ఆయన అన్నారు. తమకు ఇంకా 19 ఖాతాలున్నాయని, నాలుగు నెలలకు సరిపడే న్యూస్ ప్రింట్ ఉందని, ఈ నెల జీతాలు చెల్లించామని సాక్షి సిఇవో రామకృష్ణా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలను ఆయన గుర్తు చేస్తూ ఇక దేని కోసం పాత్రికేయ సంఘాలు ఆందోళన చేస్తున్నాయని ఆయన అడిగారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రయోజనాల కోసం పాత్రికేయ సంఘాలు ఆందోళన చేస్తున్నాయని ఆయన విమర్శించారు.

అక్రమాలతో సంపాదించి డబ్బుతో రాజకీయ నాయకుడైన వైయస్ జగన్ పత్రిక, చానెల్ పెట్టుకున్నారని, అక్రమాలపై కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు జరుపుతోందని, అలాంటి వ్యక్తులకు మద్దతిచ్చే విధంగా పాత్రికేయులు ఆందోళనకు దిగితే పాత్రికేయులపై ఉన్న గౌరవం తగ్గుతుందని ఆయన అన్నారు. పాత్రికేయులు తమను తాము తాకట్టు పెట్టుకునే విధంగా ఎందుకు వ్యవహరిస్తారని ఆయన అడిగారు. పాత్రికేయ సంఘాలు ప్రశ్నించాల్సింది ప్రభుత్వాన్ని, పత్రికా యాజమాన్యాన్ని గాని విచారణ సంస్థలను కాదని ఆయన అన్నారు.

తమ భద్రతకు ప్రమాదం ఉందని ఉద్యోగులు రోడ్డు మీద పడితే యాజమాన్యం ఎందుకు భరోసా ఇవ్వలేకపోతోందని ఆయన అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో సత్యం కంప్యూటర్స్ కుంభకోణం వెలుగు చూసినప్పుడు ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, ఉద్యోగులకు భద్రత కల్పించే చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు. విచారణను అడ్డుకోవడానికి, అక్రమాలకు పాల్పడిన ఓ సంస్థ యాజమాన్యాన్ని కాపాడే విధంగా పాత్రికేయ సంఘాలు వ్యవహరించడం సరి కాదని ఆయన అన్నారు.

ఉద్యోగుల భద్రతకు ముప్పు లేదని కోర్టు ఆదేశాలు కూడా ఇచ్చిందని ఆయన చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వైయస్ జగన్ ఆస్తులను జప్తు చేయడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆర్డినెన్స్ తెచ్చి చర్యలు తీసుకోవాల్సి ఉండిందని, కానీ అలాంటి చర్యలు తీసుకోలేదని, దీన్ని బట్టి కిరణ్ కుమార్ రెడ్డి జగన్‌తో కుమ్మక్కయ్యారని అర్థమవుతోందని ఆయన అన్నారు. ఉద్యోగుల భద్రతకు ముప్పు ఉందని గ్రహిస్తే ఉద్యోగుల హక్కులన కాపాడడానికి, వారికి భద్రత కల్పించడానికి ఓ నిపుణుల కమిటీని వేసి ప్రభుత్వం ఆ సంస్థలను స్వాధీనం చేసుకుని నడిపించాలని ఆయన అన్నారు. అలా చేయడం లేదంటే ప్రభుత్వం వైయస్ జగన్ మీద కంటితుడుపు చర్యలే తీసుకుంటోందని భావించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+