జగన్ పార్టీలోకి దేవినేని తమ్ముడు, చిచ్చు అన్న ఉమ

విజయవాడ పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వంశీ మోహన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి ఎప్పుడైనా వెళ్లవచ్చుననే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల జగన్మోహన్ రెడ్డి, వల్లభనేనిలు కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన జగన్ పార్టీలోకి వెళ్లేందుకే కలిశారని అన్నారు. ఆ తర్వాత రోజు రాత్రి కూడా జగన్‌తో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే వంశీ మాత్రం తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను కొట్టిపారేశారు.
తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని చెప్పారు. జగన్‌ను కలిసిన విషయంపై పార్టీ అధినేతకు లిఖిత పూర్వకంగా లేఖ రాసిచ్చారు. జగన్‌తో కలయిక అనుకోకుండా జరిగిందని, తాను పార్టీ క్రమశిక్షణా చర్యలు ఎక్కడా దాటలేదని, తాను పరిటాల రవీంద్రకు అనుచరుడిని అని బాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దాంతో అక్కడికి అది సద్దుమణిగింది.
అయితే తాజాగా చంద్రబాబు వర్గం నేతగా ముద్రపడ్డ దేవినేని ఉమామహేశ్వర రావు తమ్ముడు దేవినేని చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీకి ఝలక్ ఇవ్వనున్నారనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి. వల్లభనేని వెళతారనే ప్రచారం జరిగితే చంద్రశేఖర రావు వెళుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దేవినేని ఉమమహేశ్వర రావు గెలుపులో ఆయన తమ్ముడిది కీలక పాత్ర. ఎప్పుడూ అన్నకు అండగా ఉండేవాడని అంటున్నారు. అయితే ఇటీవల తన సోదరుడిని కలిసి తన రాజకీయ భవిష్యత్తుపై చర్చించినట్లుగా ప్రచారం జరుగుతోంది.
కాగా తాను పార్టీ కోసం రక్త సంబంధాన్ని కూడా లెక్క చేయనని దేవినేని ఉమామహేశ్వర రావు చెప్పారు. తన కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు వైయస్సార్ కాంగ్రెసు కుట్ర చేస్తోందన్నారు. తనకు పార్టీ చాలా ముఖ్యమన్నారు.












Click it and Unblock the Notifications