మంత్రులు చెప్పారనే అన్న పెద్దిరెడ్డి, అసంతృప్తితోనే గల్లా

అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. మంత్రుల కోరిక మేరకు తాను వెంకట రమణ గెలుపుకు కృషి చేస్తానని చెప్పారు. పార్టీలో కొన్ని విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పెద్దిరెడ్డికి విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కిరణ్‌ను సిఎం పదవి నుండి దింపే వరకు తాను ప్రయత్నాలు కొనసాగిస్తానని ఆయన గతంలోనే చెప్పారు.
అందుకు ఆయన తన వంతు ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని తొలగించాలని కోరారు. కిరణ్ తండ్రి అమర్నాథ్ రెడ్డి ఉన్నప్పటి నుండి ఇరు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఇరువురు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఒకరిపై మరొకరు పైచేయి కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. కిరణ్ ముఖ్యమంత్రి కాగానే తనకు మంత్రి పదవి రాదని భావించిన పెద్దిరెడ్డి అప్పటి నుండే తన అసంతృప్తి గళం విప్పడం ప్రారంభించారు.
అయితే ఆయన కాంగ్రెసు పార్టీని విమర్శించకుండా కేవలం కిరణ్ పైన మాత్రమే విమర్శలు చేస్తూ వస్తున్నారు. కిరణ్‌తో ఉన్న విభేదాల కారణంగా వెంకట రమణ గెలుపు కోసం ఆయన కృషి చేయకపోవచ్చుననే ప్రచారం జరిగింది. దీంతో అధిష్టానం ఆదికేశవులు, పార్థసారథిని రంగంలోకి దింపిందని అంటున్నారు.
మరోవైపు తన తనయుడు గల్లా జయదేవ్‌కు తిరుపతి టిక్కెట్ రాకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మంత్రి గల్లా అరుణ కుమారి కూడా వెంకట రమణ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని తెలిపారు. అయితే ఆమె వ్యాఖ్యలలో అసంతృప్తి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసులు ప్రచారంలో దూసుకు వెళుతున్నాయి.
అయితే గల్లా అరుణ కుమారి మాట్లాడుతూ.. కాంగ్రెసు పార్టీకి ప్రచారం అవసరం లేదని, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని చెప్పారు. వెంకట రమణ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. తన తనయుడికి టిక్కెట్ ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్న ఆమె ప్రచారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. టిక్కెట్ ఎవరికి ఇచ్చినా గెలుపుకోసం కృషి చేస్తామని ఆమె గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు ప్రచారానికి మాత్రం ఆమె ఆసక్తి చూపించడం లేదంటున్నారు.












Click it and Unblock the Notifications