హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఆస్తుల కేసు: సిబిఐ ఎదుట హాజరైన మోపిదేవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mopidevi Venkataramana
హైదరాబాద్: ప్రస్తుత ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ బుధవారం ఉదయం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) ఎదుట హాజరయ్యారు. విచారణ నిమిత్తం ఆయన సిబిఐ కార్యాలయానికి వచ్చారు. మోపిదేవిని విచారించేందుకు సిబిఐ అధికారులు ఇప్పటికే ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నారు. వాన్‌పిక్‌కు కేటాయించిన భూముల అంశంపై ఆయనను సిబిఐ ప్రశ్నించనుంది.

ఉదయం పదకొండు గంటలకు సిబిఐ కార్యాలయానికి వచ్చే సమయంలో విలేకరులు ఆయనను మాట్లాడించే ప్రయత్నం చేశారు. అందుకు ఆయన స్పందిస్తూ.. తాను సిబిఐ ఎదుట హాజరై వచ్చాక మాట్లాడుతానని, ఇప్పుడేం మాట్లాడనని చెప్పారు. కాగా మోపిదేవి సిబిఐ ఎదుట హాజరవడం ఇది రెండోసారి. మంత్రి ధర్మాన ప్రసాద రావు కూడా సిబిఐ ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది.

హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కూడా సిబిఐ అధికారులు రెండుసార్లు ప్రశ్నించారు. నాలుగు రోజుల క్రితం ఆమె ఇంటికి వెళ్లి గోప్యంగా ప్రశ్నించినట్లుగా వార్తలు వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు నుండి నోటీసులు అందుకున్న ఆరుగురు మంత్రులను కూడా సిబిఐ ప్రశ్నించే అవకాశముంది.

కాగా పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్ ప్రాజెక్టు విషయంలో జారీ అయిన జీవోపై సిబిఐ అధికారులు మోపిదేవి వెంకటరమణను ప్రశ్నించే అవకాశం ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో మోపిదేవి వెంకటరమణ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రిగా పనిచేశారు. వాన్‌పిక్ వ్యవహారంలోనే ఆయన గతంలో ఓసారి సిబిఐ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.

నిమ్మగడ్డ ప్రసాద్, అధికారి బ్రహ్మానంద రెడ్డిని అరెస్టు చేసి విచారించిన నేపథ్యంలో మోపిదేవిని సిబిఐ విచారణకు పిలువడం ప్రాధాన్యాన్ని సంతరించుకుందని అంటున్నారు. ఆధారాలు దొరికితే ఎంతటివారినైనా అరెస్టు చేయాలని ఢిల్లీ నుంచి సిబిఐ ఉన్నత స్థాయి వర్గాలు ఇక్కడి విచారణాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో మోపిదేవిని సోమవారం గానీ ఆ తర్వాత గానీ ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చుననే పుకార్లు షికార్లు పుట్టాయి.

వాన్‌పిక్‌కు ఇష్టారాజ్యంగా ప్రయోజనాలు చేకూరుస్తూ రూపొందించిన అవగాహనా పత్రం (ఎంఓయు) మోపిదేవి ఆమోదంతోనే మంత్రివర్గం ముందుకు వెళ్లిన విషయం సిబిఐ గుర్తించినట్లు చెబుతున్నారు. ఆర్థిక, న్యాయశాఖల సూచనలను వ్యతిరేకిస్తూ వాన్‌పిక్ ఎంఓయును రూపొందించినట్లు సిబిఐ దృష్టికి వచ్చిందని అంటున్నారు. వాన్‌పిక్ ప్రాజెక్టులో భాగంగా నిజాంపట్నం, వాడరేవు అనే రెండు ఓడరేవులను నిర్మించాలి. నిజాంపట్నానికి ఉత్తరాన 30 కిలోమీటర్లు, వాడరేవుకు దక్షిణాన 30 కిలోమీటర్లు ఇవ్వాలని మొదట నిర్ణయించారు.

రెండు రేవులకు ఇరువైపులా కాకుండా వాటి మధ్య స్థలంపై హక్కు కల్పిస్తే సరిపోతుందని ఆర్థిక, న్యాయశాఖలు ప్రతిపాదించాయి. అయితే, దానికి మోపిదేవి అంగీకరించలేదని అంటున్నారు. దీంతో అదనంగా వాన్‌పిక్‌కు 30 ఎకరాలు కేటాయించాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి సమక్షంలో మోపిదేవిని సిబిఐ అధికారులు విచారిస్తారని తెలుస్తోంది.

తనను అరెస్టు చేస్తారనే వార్తలపై మోపిదేవి వెంకటరమణ మీడియాపై తీవ్రంగా మండిపడ్డారు. తనను సిబిఐ పిలువలేదని ఆయన సోమవారం చెప్పారు. మీడియా వార్తలు తనకు మనస్తాపాన్ని కలిగించాయని ఆయన అన్నారు. వాన్‌పిక్ వ్యవహారంలో తాను ఏ విధమైన అక్రమాలకు పాల్పడలేదని ఆయన అన్నారు. దీనిపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. సిబిఐకి తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన చెప్పారు.

English summary
Excise Minister Mopidevi Venkataramana was deposed before CBI on wednesday morning in YSR Congress president YS Jagan assets case. It is said that CBI may question him about Nimmagadda Prasad's Vanpic. Mopidevi was minister for infra structure and investments when Vanpic was allotted land in Guntur and Prakasam districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X