జగన్ ఒక్కడేనా?: లక్ష్మీపార్వతి, కడపలోనే బంద్ ఎఫెక్ట్

Laxmi Parvathi - Konda Surekha
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్దోషిగా బయటకు రావాలని తాను కోరుకుంటున్నానని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి సోమవారం అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆమె ఎన్టీఆర్ ఘాట్ వద్ద గల ఆయన సమాధికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. సిబిఐపై తనకు నమ్మకం లేదని, అదొక రాజకీయ వ్యవస్థగా పని చేస్తోందని ఆరోపించారు.

జగన్ ఒక్కడే అవినీతిపరుడా అని ఆమె ప్రశ్నించారు. అన్ని పార్టీలలో అవినీతిపరులు ఉన్నారన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలలో అవినీతిపరులు ఉన్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గానీ, దేశంలో గానీ స్వర్గీయ నందమూరి తారక రామారావు వంటి వ్యక్తి లేరని ఆమె అన్నారు. వైయస్ విజయమ్మను దీక్ష విరమించాలని కోరతామని శోభా నాగి రెడ్డి వేరుగా అన్నారు. విజయమ్మ బుధవారం నుండి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని అన్నారు. జగన్‌ను ఇబ్బంది పెట్టడం వల్ల సిబిఐ సాధించిందేమీ లేదన్నారు. ఈనాడుకు వచ్చినట్లే సాక్షిలోకి పెట్టుబడులు వచ్చాయన్నారు.

ఉప ఎన్నికలు జరిగే 18 నియోజకవర్గాలలో ఓటమి తప్పదని తెలిసిన తర్వాతే వైయస్ జగన్ అరెస్టుకు పావులు కదిలాయని మరోనేత గట్టు రామచంద్ర రావు అన్నారు. జగన్‌ను అన్యాయంగా అరెస్టు చేశారన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేసేందుకే ఇలా చేశారన్నారు. కార్యకర్తలను నిర్బంధించడం, భయపెట్టడం ద్వారా ఓటర్లను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు.

అవకాశం ఉంటే ఉప ఎన్నికలను వాయిదా వేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. విజయమ్మ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు కంటతడి పెట్టించిందన్నారు. చాలా గ్రామాలలో కేబుల్ ప్రసారాలు నిలిపివేయడం, విద్యుత్ సరఫరాను నిలిపివేయడం చేశారన్నారు. విజయమ్మ దీక్ష విరమించి, ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

లోటస్ పాండ్ వద్ద దీక్ష చేస్తున్న వైయస్ విజయమ్మను మాజీ మంత్రి, పరకాల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖ పరామర్శించారు. తమను ప్రచారం చేయించుకోనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని తాము కమిషన్ దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. జగన్‌ను అరెస్టు చేయడం ద్వారా పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారని, కానీ అది జరగని పని అన్నారు. రోజా కూడా విజయమ్మకు సంఘీభావం తెలిపారు.

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై విజయనగరం జిల్లాలో పెన్మత్స సాంబశివ రావు మండిపడ్డారు. అవినీతి గురించి బొత్స మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెసును ప్రజలు కాటికి పంపే రోజు వస్తుందన్నారు. ఎంపి లగడపాటి రాజగోపాల్ పిచ్చివాగుడు మానుకోవాలని, వైయస్ విజయమ్మను విమర్శిస్తే పరిణామానాలు తీవ్రంగా ఉంటాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ విజయవాడలో అన్నారు.

కాగా పలుచోట్ల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబును, హైదరాబాదులో జూపూడి ప్రభాకర రావును, నెల్లూరులో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో హరిరామజోగయ్య చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి అరెస్టు చేశారు. కాగా తెలంగాణ, ఆంధ్రా, కోస్తాలలో ఎక్కడా బందు ప్రభావం కనిపించడం లేదు. అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలోనూ బస్సులు యథావిథిగా తిరుగుతున్నాయి. బందు ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. కేవలం జగన్ సొంత జిల్లా కడపలో మాత్రమే ప్రభావం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+