వైయస్ జగన్ ఇష్యూ, అప్పుడే ఐటి శాఖ కన్నేసింది

సాక్షి దినపత్రికను ప్రచురిస్తున్న జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన రిటర్న్స్‌ను పరిశీలించిన ఐటి శాఖ ఏదో పొరపాటు ఉందనే నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. జగతి పబ్లికేషన్స్‌లో 20 శాతం షేర్ క్యాపిటల్ మాత్రమే గల జగన్‌కు, ఆయన సన్నిహితులకు 90 శాతం వాటా ఉండడాన్ని ఐటి శాఖ సందేహించింది. 80 శాతం షేర్ క్యాపిటల్ గల బయటివారికి కేవలం పది శాతం వాటా మాత్రమే ఉంది.
జగతి పబ్లికేషన్స్ వాటాలను జగన్ షేర్‌కు 350 రూపాయల ప్రీమియంతో ఈక్విటీని బయటివారికి కేటాయించారు. కొన్ని షేర్ హోల్డింగ్ కంపెనీలు చాలా చిన్నవి, దాదాపుగా మనుగడలో లేనివని కూడా ఐటి శాఖ గుర్తించినట్లు చెబుతారు. కొన్ని కంపెనీలు ఎక్కడున్నాయో కూడా ఐటి శాఖకు అంతు పట్టలేదు. వాటికి నోటీసులు జారీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వాటి చిరునామాలు, వాటి డైరెక్టర్లు ఒక్కటే కావడాన్ని కూడా ఐటి అధికారులు గుర్తించారు
బయటి కంపెనీలు అంత పెద్ద మొత్తంలో జగతిలో ఎందుకు పెట్టుబడులు పెట్టారనేది ఐటి శాఖకు అంతుపట్టలేదు. జగతి పబ్లికేషన్స్ పబ్లిక్ లిస్టింగ్‌కు కూడా వెళ్లలేదు. ఆదాయం పన్ను అధికారులు ఆంధ్రప్రదేశ్‌లోని వార్తాపత్రికల రంగాన్ని అధ్యయనం చేసి గట్టి పోటీ లేదని కూడా గుర్తించారు. చాలా వార్తాపత్రికలు నష్టాల్లో ఉన్నాయని, అడ్వర్టయిజ్‌మెంట్ల మీదనే ఆధారపడుతున్నాయని గుర్తించారు. దీంతో సాక్షి దినపత్రిక లాభాల్లో నడుస్తుందని, తమకు లాభం వస్తుందని పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టలేదనే నిర్ధారణకు వచ్చారు. సాక్షి 2010 నాటికి రూ.319.84 కోట్ల నష్టాల్లో ఉంది.
పైగా, జగతి పబ్లికేషన్స్ పేరు మీద పెద్దగా ఆస్తులు కూడా లేవు. ప్రెస్ మాత్రమే ఉంది. దాని విలువ కూడా పడిపోతూ ఉంటుంది. సాక్షి కార్యాలయం భూమి, భవనం జననీ ఇన్‌ఫ్రా అనే మరో కంపెనీ పేరు మీద ఉన్నాయి. అందువల్ల జగతి పబ్లికేషన్స్ లాభాల్లో నడుస్తుందని గానీ దాని ఆస్తి విలువ పెరుగుతుందని గానీ పెట్టుబడిదారులు భావించలేదని ఐటి శాఖ అధికారులు గుర్తించారు. సాక్షిలో పెట్టుబడులు పెట్టినవారికి ఐటి శాఖ నోటీసులు జారీ చేసింది. వారంతా వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ద్వారా ఏదో విధంగా లాభపడ్డవారేనని, వారికి సెజ్‌ల పేరు మీద పెద్ద యెత్తున భూములు కేటాయించారని తెలిసింది.












Click it and Unblock the Notifications