సిబిఐ కస్టడీకి వైయస్ జగన్, క్వాష్ పిటిషన్ కొట్టివేత

శుక్రవారం సాయంత్రం నుంచి ఈ విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. శుక్రవారం సాయంత్రమే హైకోర్టు ఈ పిటిషన్లపై నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది. అయితే చివరకు దాన్ని శనివారం మధ్యాహ్నం 12 గంటలకు వెలువరిస్తామని న్యాయమూర్తి చెప్పారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కాసేపట్లో హైకోర్టు నిర్ణయం వెలువడుతుందంటూ వార్తలు వస్తున్నాయి. చివరకు మూడున్నర గంటలకు హైకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది.
వైయస్ జగన్‌ను ఐదు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. వైయస్ జగన్‌ను ప్రతి రోజు ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించాలని, విచారణ ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో జరగాలని హైకోర్టు సిబిఐని ఆదేశించింది. ఈ నెల 3వ తేదీ నుంచి ఏడో తేదీ వరకు జగన్‌ను విచారించడానికి హైకోర్టు సిబిఐకి అనుమతించింది. ఏడో తేదీ సాయంత్రం గానీ, 8వ తేదీ ఉదయం గానీ జగన్‌ను కోర్టులో హాజరు పరచాలని హైకోర్టు ఆదేశించింది. జగన్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని హైకోర్టు సిబిఐని ఆదేశించింది.
బెయిల్ ఇస్తే వైయస్ జగన్ సాక్షులను బెదిరించే ప్రమాదం ఉందని, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సిబిఐ చేసిన వాదనతో హైకోర్టు ఏకీభవిస్తూ మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది. కేసులో తొలి నిందితుడిగా ఉన్నారు కాబట్టి జగన్‌కు తెలియకుండా వ్యవహారాలు నడిచే అవకాశం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. వైయస్ జగన్‌ను మూడు రోజులు విచారించి కూడా విషయాలు ఏమీ రాబట్టలేకపోయామని, అందువల్ల తమ కస్టడీకి జగన్‌ను అప్పగించాలని సిబిఐ కోర్టుతో చెప్పుకుంది.
తన అరెస్టు అక్రమమంటూ వైయస్ జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. సిబిఐ తనను అరెస్టు చేయడం అక్రమమంటూ జగన్ చేసిన వాదనతో హైకోర్టు విభేదించింది. జగన్‌ను అరెస్టు చేసే అధికారం సిబిఐకి ఉందని చెప్పింది. దర్యాప్తులో భాగంగానే వైయస్ జగన్‌ను సిబిఐ అరెస్టు చేసిందని, అలా అరెస్టు చేసే అధికారం సిబిఐకి ఉందని హైకోర్టు తెలిపింది. దర్యాప్తు కోసం అదుపులోకి తీసుకునే అధికారం సిబిఐకి ఉంటుందని అభిప్రాయపడింది. చంచల్‌గుడా జైలులో ఉన్న వైయస్ జగన్‌ను రేపు ఆదివారం సిబిఐ తన కస్టడీలోకి తీసుకోనుంది.
వైయస్ జగన్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. వైయస్ జగన్ కేసు ఆర్థిక నేరాలకు సంబంధించిందనిస, అందువల్ల జగన్‌కు బెయిల్ ఇవ్వడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. క్రైస్తవ మత ప్రచారకుడు కెఎ పాల్‌కు ఇచ్చినట్లుగా జగన్‌కు బెయిల్ ఇవ్వలేమని చెప్పింది. జగన్ పార్లమెంటు సభ్యుడు, ఓ పార్టీ అధ్యక్షుడైనంత మాత్రాన బెయిల్ ఇవ్వడం సరి కాదని అభిప్రాయపడింది. జగన్ అరెస్టు సక్రమమేనని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications