హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ధర్మాన, సబితలకే చిక్కులు: నివేదికలకు సిఎం ఆర్డర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Dharmana Prasad Rao - Sabitha Indra Reddy
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో మంత్రులు జారీ చేసిన వివాదాస్పద జివోలపై నివేదికకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పేషీ అధికారులను ఆదేశించారు. అప్పుడు ఇచ్చిన జీవోలను విశ్లేషించి, వాటి తీవ్రత, ప్రభావం ఎంత మేరకు ఉంటుందనే విషయాలపై నివేదికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎమ్మార్ కేసులో చిక్కుకున్న ఐఏఎస్ అధికారులు బిపి ఆచార్య, ఎల్వీ సుబ్రహ్మణ్యం తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం సమీక్షించింది. ఈ సమీక్ష అనంతరం సిబిఐ కోరినట్టు ప్రాసిక్యూషన్‌కు బిపి ఆచార్యను మాత్రమే అనుమతించి, ఎల్వీ పాత్ర ఏమీ లేదన్న అభిప్రాయంతో ప్రాసిక్యూషన్‌కు ముఖ్యమంత్రి నిరాకరించారు. అదే తరహాలో ఇప్పుడు మంత్రులు తీసుకున్న నిర్ణయాల ప్రభావంపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

సుప్రీంకోర్టు ఆరుగురు మంత్రులకు నోటీసులు జారీ చేసింది. వీరిలో వైయస్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల మంత్రిగా పనిచేసిన మోపిదేవి వెంకటరమణను సిబిఐ అరెస్టు చేసింది. ఆయనతో పాటు ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. వారంతా కలిసి జారీ చేసిన 26 జీవోలపై సిబిఐ దర్యాప్తు వేగవంతం చేస్తోంది. ఈ జీవోల్లో కొన్ని తీవ్రమైనవి కాగా, మరికొన్ని జీవోలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

ఆ జోవోల ప్రభావం ఏయే మంత్రులపై పడుతుందన్న కోణంలో ముఖ్యమంత్రి కూడా ఆరా తీస్తున్నారు. అధికారుల నుంచి కూడా ఆయన వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల్లో సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులపై ఉండే తీవ్రత మిగిలిన ముగ్గురు మంత్రులు లక్ష్మీనారాయణ, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలపై ఉండక పోవచ్చునని అధికారులు అంటున్నారు. వివిధ సంస్థలకు భూములు కేటాయించడంలో, గనులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో జరిగిన అక్రమాలపై సిబిఐ చేస్తున్న దర్యాప్తు, సుప్రీంకోర్టు నోటీసులను పరిశీలిస్తే సబిత, ధర్మానలకు సమస్యలు తప్పక పోవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


అయితే భారీ పరిశ్రమల శాఖ మంత్రులుగా పని చేసిన కన్నా లక్ష్మీనారాయణ, గీతారెడ్డితోపాటు, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్యలపై అంతగా ఉండదన్న అభిప్రాయాన్ని కొందరు తెరపైకి తీసుకొస్తున్నారు. పరిశ్రమలకు అందించే భూములు వారి పరిధిలోకి రావని, ఇక ఇతర ప్రోత్సాహకాలు 2005- 2010 ప్రభుత్వ పారిశ్రామిక విధానం మేరకే వారు అందించినట్టు అవుతుందని అధికారులు అంటున్నారు. ఓబుళాపురం గనులకు సంబంధించిన కేసు తీవ్రత నేపథ్యంలో గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీలక్ష్మి వంటివారు ఇప్పటికే జైలుకు వెళ్ళారు. జగన్ అక్రమాస్తుల కేసులో సబితా ఇంద్రా రెడ్డి అవలంభించిన తీరు కొందరికి ప్రయోజనం కలిగించేదిగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీనిని కూడా అధికారులు విశ్లేషిస్తున్నారు.

అయితే భూముల కేటాయింపు అన్నది మంత్రివర్గంలో తీసుకోవాల్సిన నిర్ణయంగా, గతం నుంచి కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్న నేపథ్యంలో భూముల వివాదం తనను చుట్టుముట్టదనే అభిప్రాయాన్ని ధర్మాన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం ఆ శాఖ మంత్రి బాధ్యత ఎక్కువగా ఉంటుందని, అందువల్ల ప్రస్తుత దర్యాప్తుల్లో ధర్మాన కూడా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి తప్పక పోవచ్చునని అంచనా వేస్తున్నారు.

English summary
It is said that CM Kiran kumar Reddy has ordered his peshi to submit a report on the GOs issued ny six ministers during YS Rajasekhar Reddy's regime. It is learnt that nibisters Sabitha Indra Reddy and Dharmana Prasad Rao may face serious trouble for issuing those GOs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X