సంగ్మా వైపు ఎన్డియే చూపు: ప్రణబ్‌కు మేనకా మద్దతు

రాష్ట్రపతి పదవికి ప్రణబ్ ముఖర్జీ సరైన అభ్యర్థి అని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా కుటుంబ సభ్యురాలు, బిజెపి నేత మేనకా గాంధీ అన్నారు. రాష్ట్రపతి పదవికి ప్రణబ్ ముఖర్జిని అద్భుతమైన అభ్యర్థిగా ఆమె అభివర్ణించారు. ప్రణబ్‌కు అన్నివిధాలా అనుకూలత కూడా ఉన్నదని అన్నారు. జులై 19న యుపీఏ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న ప్రణబ్ ముఖర్జీని కలిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.
ప్రణబ్ సీజన్డ్ పొలిటీషియన్ అని, ప్రణబ్ తనకు గత ముప్పై ఏళ్ళుగా తెలుసునని, రాష్ట్రపతి పదవికి అలాంటి వారు అవసరమని ఆమె అన్నారు. ఈ స్థితిలో ఎన్డియె అన్నాడియంకె, బిజూ జనతాదళ్ సంయుక్తంగా ప్రతిపాదించిన ఎన్సీపీ సీనియర్ నాయకుడు సంగ్మా పేరును పరీశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే సంగ్మా అభ్యర్థిత్వానికి ఎన్డీయె కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షాలైన శివసేన, జేడీ (యు) సమ్మతించక పోవడంతో వారిని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు బిజెపి అగ్రనేతలు అద్వానీ, సుష్మా స్వరాజ్ స్వయంగా రంగంలోకి దిగి ఆయా పార్టీల నేతలతో సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
నిజానికి, సంగ్మా బలమైన పత్యామ్నాయం కాకపోయినప్పటికీ, ప్రణబ్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఎన్డీయె ఈ దిశగా సమాలోచనలు జరుపుతోంది. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ తమ పార్టీకి చెందిన సంగ్మా అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడంతో వైరిపక్షం శివసేనను సముదాయించే వీలున్నదని బిజెపి నేతలు భావిస్తున్నారు. తాను రాష్ట్రపతి అభ్యర్థి రేసులో లేనని ఇప్పుడే ప్రకటన చేయవద్దని బిజెపి అగ్రనేత కోరినా కలామ్ వినలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications