భూవిధానానికి ప్రభుత్వం బ్రేక్, వాన్‌పిక్‌పై పరిశీలన

మూడు కేటగిరీలు, ధరలు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వివిధ విభాగాలకు భూ కేటాయింపుల విషయంలో స్పష్టత లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు ఏపీఐఐసీ ముందస్తుగా ల్యాండ్ బ్యాంకును సమకూరుస్తుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయని చెప్పారు. ఈ సమయంలో ఏపీఐఐసీకి ల్యాండ్ బ్యాంకు ఉంటుందని కొందరు, ఉండదని మరికొందరు మంత్రులు వాదించారు.
ల్యాండ్ బ్యాంకుగా ఏపీఐఐసీ వెయ్యి ఎకరాలను సేకరిస్తుందని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి చెప్పారు. అందులో కొంత భూమికి పరిశ్రమలను స్థాపించే సమయంలో కేబినెట్ ఆమోదం పొందుతుందని వివరించారు. దీంతో, మంత్రి ఆనం జోక్యం చేసుకుంటూ.. ప్రైవేటు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించిన అధికారాన్ని కలెక్టర్ నుంచి తొలగించి సీసీఎల్ఏ వద్ద ఉంచడంలో అర్థం లేదన్నారు. ప్రతి భూ కేటాయింపు అంశమూ కేబినెట్ ఆమోదంతోనే జరగాలని వాదించారు. భూ కేటాయింపులకు మంత్రివర్గమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
ల్యాండ్ బ్యాంక్ విషయంలో ఏపీఐఐసీకి అధికారం ఉండాల్సిందేనని, లేకపోతే పరిశ్రమల స్థాపనకు ఎవరు ముందుకు వస్తారని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. దీంతో, ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. భూ కేటాయింపుల విధానంపై మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీనిపై అందరి ఆమోదం పొందాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించడంతోపాటు వారం రోజుల్లోగా మంత్రులందరితోనూ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ సమావేశంలోగా మంత్రులందరికీ నోట్ పంపాలని సూచించారు.
ఇప్పటి వరకూ సాగు భూములను కూడా పరిశ్రమలకు కేటాయిస్తున్నామని, దీనివల్లే రైతుల్లో అసంతృప్తి పెరగడం.. ఆందోళనలు చేపట్టడం వంటివి చోటు చేసుకుంటున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. ఇకపై బీడు భూములను మాత్రమే పరిశ్రమల స్థాపనకు కేటాయిద్దామని చెప్పారు. వాటికి సంబంధించిన సర్వే నెంబర్లను పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంచుదామని సీఎం ప్రతిపాదించారు. కాగా.. బయ్యారం గనుల ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. తర్వాత లక్షింపేట అంశాన్ని మంత్రి కోండ్రు మురళి ప్రస్తావించారు.
కారంచేడు, చుండూరుల్లో ఇచ్చిన ప్యాకేజీని బాధితులకు అందజేయాలని సూచించారు. ఈ సమయంలో మంత్రి మాణిక్య వరప్రసాద్ జోక్యం చేసుకుంటూ ఈ వ్యవహారంపై సత్వర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేసేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని, దళిత సంఘాలు, బాధిత కుటుంబాలు కోరుతున్నట్లు సీబీఐ విచారణ జరపాలని కోరారు. ఇందుకు మిగిలిన మంత్రులు విభేదించారు. ప్రస్తుతం సీబీసీఐడీ బాగానే పని చేస్తోందని, 45 మందిపై బాధితులు ఫిర్యాదు చేస్తే.. సీఐడీ 64 మందిని అరెస్టు చేసిందని చెప్పారు.
సీబీఐ దర్యాప్తుతో ఆలస్యమవుతుందని, బాధితులకు సత్వర న్యాయం జరగదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాజకీయంగా చర్చనీయాంశమైన వాన్‌పిక్ భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని మాణిక్య వరప్రసాద్ సూచించారు. ఇప్పటికే ఈ భూముల కేటాయింపులకు సంబంధించి మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు సహా ఒక ఎంపీ, పలువురు అధికారులు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సీబీఐ చెప్పేంత వరకు వేచి ఉండకుండా ప్రభుత్వమే సమగ్ర విధానాన్ని అమలు చేయాలని సూచించారు. వాన్‌పిక్ భూములను వెనక్కు తీసుకోవడంపై న్యాయపరమైన ప్రతిబంధకాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. నిర్ణీత కాలంలో పరిశ్రమలు స్థాపించని సంస్థల భూములను రద్దు చేద్దామన్నారు. కాగా.. అధికారులు వెళ్లిపోయిన తర్వాత.. ఒకటో తేదీన రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రానికి వస్తున్నారని, సీఎల్పీ సమావేశానికి శాసన సభ్యులందరూ హాజరయ్యేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు.
ఉప ఫలితాలపై మంత్రి ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన కమిటీ వేశామని, ఈ కమిటీ సమీక్షలు జరుపుతుందని చెప్పారు. కాగా.. జిల్లా ఇన్‌చార్జి మంత్రులను మార్చాలన్న యోచనలో ఉన్నట్లుగా సీఎం చెప్పారు. ఎవరికైనా అభ్యంతరాలుంటే వెల్లడించవచ్చని సూచించారు.












Click it and Unblock the Notifications