కృష్ణా డెల్టాకి సిఎం నీటి వరం, తెలంగాణ నేతలు ఫైర్

కృష్ణా డెల్టాలో నారుమళ్లకు నీరివ్వాలన్న జీవో నెం.69కి అనుగుణంగా శుక్రవారం సాయంత్రం నాగార్జునసాగర్ అధికారులు ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా దిగువకు 5700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గేట్లు ఎత్తీ ఎత్తగానే అలా కలకలం మొదలైంది. నీటి విడుదల ఆపాలంటూ నల్లగొండ జిల్లా పెద్దవూర మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రమేష్‌జీ, ఇతర కార్యకర్తలు సురేష్, చాంద్‌పాషా, మొయిన్ డిమాండ్ చేశారు. జలవిద్యుత్ కేంద్రం వద్ద నీటి ప్రవాహంలోకి దిగి ఆందోళన చేపట్టారు. డ్యామ్ అధికారులు నచ్చజెబుతున్నా వినలేదు.
జల ప్రవాహంలో అలాగే నిలుచున్నారు. పోలీసులు దగ్గరికొస్తే నీటిలో మరింత లోపలికి వెళతామని హెచ్చరించారు. వారిని బయటికి రప్పించలేక, నీటి విడుదల కొనసాగించలేక పోలీసులు, జెన్‌కో, నీటిపారుదల అధికారులు ఆందోళనకు గురయ్యారు. విధిలేని స్థితిలో నీటి విడుదలను ఆపివేశారు. ఆందోళన దిగిన నలుగురు తెరాస కార్యకర్తలు నీటి నుంచి బయటికి వచ్చారు. వారిని వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.
కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలనే ముఖ్యమంత్రి నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు మాత్రమే కాకుండా కాంగ్రెసు తెలంగాణ నాయకులు కూడా మండిపడుతున్నారు. తెలంగాణ రైతుల పట్ల ఇది వివక్ష చూపడమేనని వారన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి వ్యతిరేకిస్తూ తెలంగాణకు చెందిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి రాజీనామా చేయాలని తెరాస నాయకుడు హరీష్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూడా వ్యతిరేకించారు.












Click it and Unblock the Notifications