ప్రణబ్ నామినేషన్ ఓకే, సంగ్మా అభ్యంతరాలు తోసివేత

ప్రణబ్ ముఖర్జీ నామినేషన్‌తో పాటు సంగ్మా నామినేషన్‌ను కూడా రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. దీంతో ఈ నెల 19వ తేదీన జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఇరువురి మధ్య ముఖాముఖి పోరు ఖాయమైంది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ వికె అగ్నిహోత్రి రాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి ఎనిమిది రోజుల ముందే జూన్ 20వ తేదీన ప్రణబ్ ముఖర్జీ ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ (ఐఎస్ఐ) చైర్మన్ పదవికి రాజీనామా చేశారని ప్రణబ్ ముఖర్జీ తరఫున చేసిన వాదనను అగ్నిహోత్రి అంగీకరించారు.
ప్రణబ్ ముఖర్జీ ప్రతినిధిగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పికె బన్సాల్ కేంద్ర హోం మంత్రి చిదంబరంతో కలిసి రిటర్నింగ్ అధికారి ముందు హాజరయ్యారు. సంస్థ అధ్యక్షుడికి ప్రణబ్ ముఖర్జీ రాజీనామా లేఖను పంపినట్లు బన్సాల్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. రిటర్నింగ్ అధికారి ప్రణబ్ ముఖర్జీకి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చి నామినేషన్‌ను అంగీకరించినట్లు ఆయన తెలిపారు.
ఐఎస్ఐ చైర్మన్‌గా లాభదాయక పదవిలో కొనసాగుతున్నందున ప్రణబ్ ముఖర్జీ నామినేషన్‌ను తిరస్కరించాలని సంగ్మా రిటర్నింగ్ అధికారి ముందు పిటిషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయానికి ప్రణబ్ ఆ పదవిలో కొనసాగుతున్నారని సంగ్మా ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications