'అక్కసుతోనే పివిపై అర్జున్, కుల్దీప్ దగ్గరగా చూడలేదు'

ముందే రాష్ట్రపతి పాలన విధించాలని అర్జున్ సింగ్ కోరారని, రాజ్యాంగాన్ని పివి ఎక్కడా అతిక్రమించలేదని, అలాంటి వ్యక్తిని నీరోతో పోల్చడం అక్కసును సూచిస్తోందని, కుల్దీప్ నయ్యర్ మాజీ ప్రధానిని ఎప్పుడూ దగ్గర నుండి చూడలేదని విమర్శించలేదు. ఆయన పూజనే చేయరని, అసలు పూజ గది కూడా లేదని చెప్పారు. ప్రధాని పదవిని ఆశించి భంగపడిన కడుపు మంటతోనే అర్జున్ సింగ్ ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాబ్రీ మసీదు విధ్వంసం సమయంలో పివి పూజలో ఉన్నారని.. మసీదు కూల్చివేత పూర్తయ్యాకే బయటకు వచ్చారని సీనియర్ పాత్రికేయుడు కుల్దీప్ నయ్యర్ చేసిన వ్యాఖ్యలనూ వారు తీవ్రంగా ఖండించారు. పివి నిద్రలేవగానే తన గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోకు నమస్కరించి, ఆ తర్వాత రోజువారీ పనుల్లోకి దిగేవారని వివరించారు. ఏపీయూడబ్ల్యూజే, ప్రెస్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన 'మీట్ ది ప్రెస్'కు వారు హాజరయ్యారు.
పివి హయాంలో జరిగిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే తాము వచ్చామని తెలిపారు. ఆనాటి ఘటనలకు తాము సాక్షులుగా ఉన్నామని చెప్పారు. 1992 డిసెంబరు ఆరున ఉదయం పదిన్నర నుంచి 12 గంటల వరకూ ప్రధాని నివాసం నుంచే ఆయన తన అంతరంగిక కార్యదర్శి ఏఎన్ వర్మ, కేంద్ర హోం మంత్రి ఎస్‌బీ చవాన్, కార్యదర్శి మాధవ్ గోఖలే, కేబినేట్ కార్యదర్శి రాజ్‌గోపాల్, ఐబీ చీఫ్ వైద్యతో చర్చించారని.. ఆ వెంటనే ఉత్తరప్రదేశ్ గవర్నర్‌తోనూ మాట్లాడారని తెలిపారు.
అంతా సవ్యంగానే ఉందని గవర్నర్ పివికి వివరించిన సంగతిని చెప్పారు. నాటి యూపీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ చేసిన తప్పులకు పివిని బాధ్యుడిగా చేయడం తగదని హితవు పలికారు. పివిని రోమ్ తగలబడిపోతుంటే ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తితో పోల్చడమంటే ఆయనకు ఎంత అక్కసు ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇక, పివిని ఎప్పుడూ కనీసం దగ్గర నుంచి కూడా చూడని కులదీప్ నయ్యర్.. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఆయన పూజ గదిలో ఉన్నారని చెప్పడం హాస్యాస్పదమన్నారు.
పివి హయాంలో పనిచేసిన వారిలో 90 శాతం అధికారులు ఇప్పుడు జీవించే ఉన్నారని.. వారు కూడా ప్రతిరోజూ జాతీయ మీడియాలో చెబుతూనే ఉన్నారని అన్నారు. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. తమ కుటుంబం ప్రధాని పీఠంపై ఉన్నట్లయితే బాబ్రీ లాంటి ఘటనలకు తావుండేది కాదనడాన్ని చూస్తే పివిని బద్నాం చేసేందుకు కుట్ర జరుగుతోందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయని ఆరోపించారు. బాబ్రీ కూల్చివేత అనంతరం పివి హుటాహుటిన కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి యూపీలో రాష్ట్రపతి పాలన విధించారని గుర్తు చేశారు.
బాబ్రీ విషయమై యూపీలోని బిజెపి సర్కారుకు పివి మద్దతు ఇచ్చి ఉంటే.. అక్కడ రాష్ట్రపతి పాలన ఎందుకు విధిస్తారని వారు ప్రశ్నించారు. బాబ్రీ కూల్చివేతపై నియమించిన లిబర్‌హాన్ కమిషన్ కూడా.. తప్పంతా కళ్యాణ్ సింగ్ ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పిందని వివరించారు. పివి హయాంలో ఆర్థిక సంస్కరణలు బాగా అమలై దేశం పురోభివృద్ధి చెంది పివికి మంచి పేరు వచ్చిందని.. ఇప్పుడు తిరోగమనంలో ఉండడంతో పివిపై దుమ్మెత్తిపోస్తున్నారని మండిపడ్డారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!