గాలి బెయిల్ కేసు: జడ్జి లక్ష్మీ నరసింహ రావు అరెస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu
Laxmi Narasimha Rao
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన బెయిల్ వ్యవహారంలో జడ్జి లక్ష్మీ నరసింహా రావును అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) అధికారులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. బుధవారం ఎసిబి అధికారులు ఆయనను అదుపులోకి తీసుకొని సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయనను అరెస్టు చేసి అనంతరం వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయనను ఎసిబి కోర్టులో హాజరుపర్చుతారు. లక్ష్మీ నరసింహ రావు సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో స్మాల్ కాజస్ కోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. గాలి బెయిల్ కేసులో ఆయనపై ఆరోపణలు రావడంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆయనపై బుధవారం వేటు వేసింది. ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఇప్పటికే గాలి బెయిల్ కేసులో అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్న పట్టాభి రామారావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ప్రాణహిత బ్లాక్‌లోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

గాలి బెయిల్ కేసులోనే జడ్జి ప్రభాకర రావును కూడా ఎసిబి శ్రీకాకుళం జిల్లాలో గురువారం అరెస్టు చేసింది. గాలి బెయిల్ కేసులో ప్రభాకర రావుపై ఆరోపణలు రావడంతో హైకోర్టు అతనిని శ్రీకాకుళం ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఆ తర్వాత రోజు అక్కడ బాధ్యతలు స్వీకరించడానికి వెళ్లగా అంతలోనే సస్పెండ్ చేస్తూ వేటు వేసింది. ఈరోజు అతనిని ఎసిబి అరెస్టు చేసింది.

కాగా కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ వ్యవహారంలో యాదగిరి రావు కీలక పాత్రధారి అని అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో వారం రోజుల క్రితం పేర్కొన్న విషయం తెలిసిందే. తాము యాదగిరి ఇంట్లో సోదాలు నిర్వహించామని, ఆయన ఇంటిలోని దేవుడి గదిలో రూ.3.75 కోట్లు స్వాధీనం చేసుకున్నామని రిపోర్టులో పేర్కొన్నారు. యాదగిరి సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశముందని చెప్పారు.

ఆయన వద్ద నుండి నాలుగు సెల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, ఓ కారు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కంప్లి శాసనసభ్యుడు సురేష్ బాబు, గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర రెడ్డి నుండి యాదగిరి రూ.9.5 కోట్లు తీసుకున్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మాజీ జడ్జిలు పట్టాభి రామారావు, చలపతి రావులతో యాదగిరి పలుమార్లు ఫోన్‌లలో మాట్లాడారని చెప్పారు.

ఐడిబిఐ బ్యాంకులో యాదగిరి రూ.36 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారని తెలిపారు. యాదగిరి నుండే మిగతా నిందితులకు డబ్బులు అందాయని తెలిపారు. సోమశేఖర రెడ్డి ఏడు వాయిదాలలో యాదగిరికి డబ్బులు పంపించాడని, ఆ డబ్బుతోనే అతను కారు, ఇల్లు, ఇంటిస్థలం కొన్నారని పేర్కొన్నారు. కాగా యాదగిరి ఇంటి నుండి స్వాధీనం చేసుకున్న డబ్బును ఎసిబి కోర్టులో జమ చేసింది. కాగా గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ వ్యవహారంలో యాదగిరిని ఎసిబి రెండు రోజుల క్రితం కర్నూలులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు ఇదే కేసులో అరెస్టైన మాజీ జడ్జి పట్టాభి రామారావుకు కోర్టు రిమాండును పొడిగించింది. పట్టాబిని మరో రెండు వారాల జ్యూడిషియల్ కస్టడీకి పంపింది. దీంతో అతనిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ ఇప్పించేందుకు జడ్జిలకు భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చారనే ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పట్టాభి రామారావు, చలపతి రావు, పట్టాభి తనయుడు రవిచంద్ర, యాదగిరిలను ఎసిబి అరెస్టు చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Another judge Laxmi Narasimha Rao arrested by ACB on Thursday morning in Karnataka former minister Gali Janardhan Reddy's bail case.
Please Wait while comments are loading...