బాబు ఆస్తులపై విజయమ్మ పిటిషన్: 23న విచారణ

చంద్రబాబు సహా 17 మంది ఆస్తులపై విచారణ జరపాలని ఆమె ఆ పిటిషన్‌లో సుప్రీం కోర్టును కోరారు. చంద్రబాబు ఆస్తులపై విచారణ జరిపించాలని తాను వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. గతంలో విజయమ్మ వేసిన పిటిషన్‌పై చంద్రబాబు, తదితరుల ఆస్తులపై సిబిఐ విచారణకు ఆదేశించింది. అయితే, దీనిపై కొంత మంది సుప్రీంకోర్టుకు వెళ్లారు. తమకు నోటీసులు ఇవ్వకుండా విచారణకు ఆదేశించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని వారు వాదించారు.
అయితే, ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో వాళ్లు హైకోర్టులో ఆ విషయంపై పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ సాగించిన తర్వాత చంద్రబాబు, తదితరుల ఆస్తులపై విచారణ జరిపించాలనే వైయస్ విజయమ్మ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రజా ప్రయోజనం కాదని, అందువల్ల కొట్టేస్తున్నామని వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్‌ను హైకోర్టు తెలిపింది.
హైకోర్టు తమ పిటిషన్‌ను తోసిపుచ్చడాన్ని విజయమ్మ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. వైయస్ విజయమ్మ గతంలో వేసిన పిటిషన్‌లో ఈనాడు అధినేత రామోజీరావు పేరుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు కూడా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సుజనా చౌదరి, సిఎం రమేష్ వంటివారు ప్రయోజనాలు పొందారని, ఇందులో అధికార దుర్వినియోగం జరిగిందని వైయస్ విజయమ్మ ఆరోపించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కూడా అవే పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు జగన్ అక్రమాస్తులు, ఓఎంసి కేసులలో నిందితులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, శ్రీలక్ష్మి తదితరుల రిమాండును కోర్టు ఆగస్టు 1 వరకు పొడిగించింది. వారిని వీడియో కాన్ఫరెన్సు ద్వారా కోర్టు విచారించింది.












Click it and Unblock the Notifications