వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపిలో సీన్ రివర్స్: అన్నీ తేల్చేస్తానంటున్న బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ, ఎస్సీ వర్గీకరణ తదితర వివాదాస్పద అంశాలపై ఓ స్పష్టత ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. తటస్థ వైఖరితో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా కలుగుతోందని భావించిన చంద్రబాబు ఆయా సమస్యలపై స్పష్టత ఇస్తేనే పార్టీని గట్టెక్కించవచ్చుననే అభిప్రాయానికి వచ్చారని తెలుస్తోంది. అయితే ఆయన వైఖరి పార్టీలో ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు.

తటస్థంగా ఉన్న అన్ని అంశాల్లో పార్టీ వైఖరిని తేల్చేయాలని... ఇక దేనిపైనా తాత్సారం తగదన్న నిర్ణయానికి వచ్చారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో తన మనోగతాన్ని తేల్చి చెప్పేస్తున్నారు. ఆయన స్పీడు పార్టీ నేతల్లో కొందరికి హుషారు కలిగిస్తుంటే.. మరి కొందరిని బెంబేలెత్తిస్తోంది. నిర్ణయం తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారని గతంలో బాబుపై విమర్శలు గుప్పించిన నేతల్లో కొందరు ఇప్పుడు ఆయనకు బ్రేకులు వేసే ప్రయత్నాల్లో ఉన్నారు.

వివాదాస్పద అంశాల్లో తొందరపాటు పనికి రాదని, అసెంబ్లీ ఎన్నికల ముందు ఆవేశానికి గురైతే అందరం నష్టపోతామని వారు హెచ్చరిస్తున్నారు. అలాంటి వివాదాస్పద అంశాలు ఇప్పుడు ఆ పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ తటస్థ వైఖరి అవలంబిస్తున్న వాటిలో అతి పెద్ద అంశం.. తెలంగాణ. రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో బహిరంగంగా ఎటూ మొగ్గు చూపలేక చంద్రబాబు తటస్థ వైఖరితో వ్యవహరిస్తూ వస్తున్నారు. కాని ఇటీవలి కాలంలో ఆయనపై తెలంగాణ నేతల ఒత్తిడి పెరిగింది. గతంలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని తర్వాత దానిని గట్టిగా చెప్పలేకపోవడం ఇబ్బందిగా మారిందని, తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయాన్ని ప్రకటిస్తే ఈ ప్రాంతంలో పార్టీ మళ్ళీ పుంజుకొంటుందని వారు ఆయన వద్ద వాదిస్తున్నారు.

ఇటీవలి ఉపఎన్నికల్లో సీమాంధ్రలో దెబ్బ తిన్న తర్వాత చంద్రబాబు వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. తెలంగాణ నేతలు కోరుకొంటున్నట్లుగా.. తెలంగాణకు అనుకూలంగా స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఆయన భావిస్తున్నారు. తెలంగాణపై మరింత స్పష్టత ఇస్తానని బాబు ఇటీవల ఒక సమావేశంలో ప్రకటించారు. కాని ఆయన యోచనపై సీమాంధ్ర నేతలు కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 'జగన్ పార్టీ ఏ వైఖరీ చెప్పకుండా తటస్థంగా వెళుతోంది. మనం తొందరపడితే వారు లాభపడతారు. అందుకే వేచి చూసే ధోరణితో వెళ్ళాలని మేం కోరుతున్నాం' అని సీమాంధ్రకు చెందిన ఒక యువ ఎమ్మెల్యే పేర్కొన్నారు.

దీనిపై కొందరు సీమాంధ్ర నేతలు ఇప్పటికే చంద్రబాబు వద్ద తమ వాదన వినిపించారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై కూడా టీడీపీ గతంలో తటస్థ వైఖరిని అవలంబించింది. అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణను సమర్థించిన ఆ పార్టీ.. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇరు వర్గాలను దరి చేర్చుకోవాలన్న యోచనతో తటస్థ వైఖరిని తీసుకొంది. కాని ఇటీవల చంద్రబాబు ఆలోచన మారింది.

ఎస్సీ వర్గీకరణకు పూర్తి మద్దతును ప్రకటిస్తే బాగుంటుందన్న మాదిగ ఉపకులం నేతల వాదనకు ఆయన ఆమోదం తెలిపారు. కోస్తాలో ఎక్కువగా ఉన్న మాల ఉపకులంలోని అధిక సంఖ్యాకులు ఇటీవల జగన్ పార్టీకి అనుకూలంగా మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో.. మాదిగ ఉప కులాన్నయినా పార్టీకి దగ్గర చేసుకోవాలని ఒక వర్గం ఎస్సీ నేతలు చంద్రబాబు ముందు వాదన వినిపించారు.

ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన వైఖరి తీసుకొంటేనే అది సాధ్యపడుతుందని వారు వివరించారు. వారి వాదనకు చంద్రబాబు ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేశారు. కాని కోస్తా ప్రాంతానికి చెందిన మాల ఉపకులం నేతలతోపాటు ఆ ప్రాంత పార్టీ నేతలు కూడా ఈ నిర్ణయంతో విభేదిస్తున్నారు. మాలల సంఖ్యాబలం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లోని పార్టీ నేతలు దీనిపై తొందరపడవద్దని చంద్రబాబును కలిసి కోరుతున్నారు. ఈ నిర్ణయం వల్ల తాము నష్టపోతామన్నది వారి వాదన. 'కొంత కాలంగా తటస్థ వైఖరితో ఉంటున్నాం. కాని దాని వల్ల ఫలితాలు రావడం లేదు. ఎటో ఒక వైపు మొగ్గితే అటు వైపైనా సానుకూలత వస్తుందని అనిపిస్తోంది. చంద్రబాబు కూడా అదే విధంగా భావిస్తున్నారు. దానిని తప్పుబట్టలేం' అని తెలంగాణ నేత ఒకరు వెల్లడించారు.

English summary
It is said that Telugudesam party chief Nara Chandrababu Naidu is trying to clarify on Telangana and SC reservation issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X