హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయాల్లో యువతకు ప్రోత్సాహం: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: యువశక్తిని తాము రాజకీయాల్లో ప్రోత్సహిస్తామని, యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
మనదేశానికి ఉన్న యువశక్తి మరే దేశానికీ లేదని, రాష్ట్రంలో కూడా అపారమైన యువశక్తి ఉందని.. అయితే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మాత్రం యువత భవిష్యత్తు గురించి పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో గత ఎనిమిది సంవత్సరాలుగా నిరుద్యోగం, రౌడీయిజం, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెంకట లక్ష్మీనారాయణ, వంశీకృష్ణ నేతృత్వంలో పలువురు విద్యార్థులు గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రాబాబు మాట్లాడారు. రాజీవ్ యువకిరణాలు, రాజీవ్ ఉద్యోగశ్రీ అంటూ మాటలు చెబుతున్న ముఖ్యమంత్రి.. యువత భవిష్యత్తు గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. యువత భవిష్యత్తును తీర్చిదిద్దడం ద్వారా రాష్ట్రాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతోనే టీడీపీ హయాంలో పలు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగానే అంతర్జాతీయ ప్రమాణాలను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చామని వివరించారు.

విలువలతో కూడిన పాలన రావాలంటే యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. అవినీతిపరుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపైనే ఉందన్నారు. రాష్ట్రంలో, దేశంలో అవినీతిని అంతమొందించేందుకు తెలుగుదేశం చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత కోసం ఎంట్రప్రెన్యూర్ డెవలప్‌మెంట్ కోర్సులను నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మువ్వా గోపాలకృష్ణ, వెంకటేష్, శివవర్ధన్ రెడ్డి తదితర విద్యార్థి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరోవైపు.. టీడీపీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యంలో.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన యాదవ సంఘం నేతలు సత్యం, వెంకటేష్, హన్మంత్, శ్రీరాములు, గోవింద్ తదితరులు చంద్రబాబును కలిసి కృతఙ్ఞతలు తెలిపారు. వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. గొర్రెలు, మేకల సహకారాభివృద్ధి ఫెడరేషన్‌కు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని దుయ్యబట్టారు. గొర్రెల కాపరులకు ఎక్స్‌గ్రేషియా అందకపోయినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జిల్లాల వడ్డెర సంఘం నేతలు సాంబరాజ్, గుంజే హన్మంతు, మైసయ్య, మనోహర్ తదితరులు కూడా చంద్రబాబును కలిసి కృతఙ్ఞతలు తెలిపారు.

వడ్డెరలను ఎస్టీల్లో చేర్చేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నేతలు రేవూరి ప్రకాష్‌రెడ్డి, పి. చంద్రశేఖర్, కనకాచారి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా.. విద్యుత్తు కోతలను నిరసిస్తూ ఈ నెల 31న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద సామూహిక ధర్నాలను నిర్వహించాలని టీడీపీకి చెందిన టీఎన్టీయూసి నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నారు. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు జి. రాంబాబు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు.

ప్రజలపై అడ్డగోలు పన్నులు, చార్జీలు వేసి ముక్కు పిండి వసూలు చేయడంలో కిరణ్ పాలన తుగ్లక్ పాలనను మరిపిస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శోభారాణి విమర్శించారు. ప్రజలపై భారం మోపబోనని.. ఇందిరమ్మ పాలన తెస్తానని ముఖ్యమంత్రి అయిన కొత్తలో కిరణ్ పదేపదే ప్రకటనలు చేస్తే నిజమేనని నమ్మిన ప్రజలకు ఇప్పుడు శఠగోపం పెడుతున్నారని, అయినకాడికి వాతలు పెట్టి ఖజానా నింపుకోవడమే పనిగా పాలన నడిపిస్తున్నారని ఆమె ఆరోపించారు.

వీలునామా చార్జీలను ఒకేసారి రూ.పది నుంచి రూ.ఐదు వేలకు పెంచడం చరిత్రలో ఉండి ఉండదని, వీలునామాలపై కూడా పన్నులను వడ్డించవచ్చన్న ఘనమైన ఆలోచన ఈ ముఖ్యమంత్రికే వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్రం పెట్రోలు రేట్లను 26 సార్లు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా వ్యాట్, విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీల పేరుతో బాదుతోందని ఆమె అన్నారు. 'వైఎస్ హయాంలో ఆయన అనుయాయులు అయిన కాడికి ఖజానాను దోచుకొని పోయారు. ఆ నష్టం భర్తీ చేసుకోవడానికి కిరణ్ సర్కారు ప్రజలపై అడ్డగోలుగా భారాలు వేస్తోంది. దీనిని మేం ఖండిస్తున్నాం. ఈ చార్జీల పెంపును తక్షణం ఆపాలి' అని డిమాండ్ చేశారు.

English summary
Telugudesam president N Chandrababu Naidu has said that he promote youth in politics. He criticised that CM Kirana kumar Reddy is neglecting youth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X