ఎమ్మెల్సీ కొండా మురళిపై అనర్హత వేటు

తనపై వేటు దుర్మార్గమైన చర్య అని కొండా మురళి అన్నారు. కాంగ్రెసుపైనే ప్రజలు వేటు వేశారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెసు పార్టీ ఓడిపోయిందని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే ఎవరి సత్తా ఏమిటో తేలిపోతుందని ఆయన అన్నారు. భవిష్యత్తు వైయస్సార్ కాంగ్రెసు పార్టీదేనని ఆయన అన్నారు.
పార్టీకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ కాంగ్రెసు పార్టీ మండలి చైర్మన్ చక్రపాణికి ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ జరిపిన చైర్మన్ చక్రపాణి మురళిపై అనర్హత వేటు వేశారు. వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉంటూ వస్తున్నారు. వైయస్ జగన్ వెంట నడుస్తూ వచ్చారు. కొండా సురేఖ తన శాసనసభా సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అయితే, ఆమెపై శాసనసభ స్పీకర్ అనర్హత వేటు వేశారు.
ఆ తర్వాత పరకాల శాసనసభా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కొండా సురేఖ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి బిక్షపతి చేతిలో ఓడిపోయారు. పరకాలలో కొండా సురేఖ విజయానికి కొండా మురళి తీవ్రంగా ప్రయత్నించారు. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరినందున కొండా మురళి నుంచి పెద్దగా ప్రతిస్పందన ఉండకపోవచ్చునని అంటున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి తన హయాంలో కొండా దంపతులను వరంగల్ జిల్లాలో పెద్ద యెత్తున ప్రోత్సహించారు. దాంతో ఇతర కాంగ్రెసు నాయకులు వైయస్ రాజశేఖర రెడ్డిపై అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications