హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాంధీభవన్‌లో వైయస్ బొమ్మ ఏది?: కెవిపి దుమారం

By Pratap
|
Google Oneindia TeluguNews

KVP Ramachandra Rao
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) కార్యాలయంలో గాంధీభవన్‌లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఫొటో లేకపోవడంపై రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెసు కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మంగళవారం మాట్లాడారు. ఆయన తీవ్ర ఉద్వేగానికి గురై ప్రసంగించారు. గాంధీభవన్‌లో వైయస్ ఫొటో లేకపోవడం బాధాకరమని, అయితే అందుకు తాను ఎవరినీ తప్పు పట్టడం లేదని ఆయన అన్నారు. వైయస్ విషయంలో కెవిపి వ్యాఖ్యలు మరోసారి కాంగ్రెసులో దుమారం రేపే అవకాశం ఉంది.

రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడమే తన లక్ష్యమని వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారని కెవిపి అన్నారు. రాహుల్‌ను ప్రధానిగా చూడడానికి పనిచేయాలని వైయస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన సందేశాన్ని లేదా ఆదేశాలను పాటించి, పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 41 సీట్లు గెలిచి కాంగ్రెసు అధిష్టానానికి కానుకగా ఇచ్చి రాహుల్‌ గాంధీని చేయాలని వైయస్ గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఒక్క సీటును వైయస్ మిత్రపక్షానికి వదిలేశారని ఆయన అన్నారు.

రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమనేది వైయస్ రాజశేఖర రెడ్డి చివరి కోరిక అని, ఆ కోరికను నెరవేర్చడానికి మనమంతా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని మనమంతా ప్రతిన చేయాలని ఆయన అన్నారు. తాను ఇక్కడి (గాంధీభవన్) పరిస్థితిని గమనించానని, యూత్ కాంగ్రెసు ఎన్నికలు జరిగిన తర్వాత కొన్ని రోజుల పాటు ఫలితాల వెల్లడిని నిలిపేశారని, యూత్ కాంగ్రెసు అధ్యక్షుడిగా ఎన్నికైన వంశీచందర్ రెడ్డి వ్యక్తిత్వంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వాటిని వెల్లడించలేదని, అనుమానాలను నివృత్తి చేసుకున్న తర్వాత ఫలితాలు ప్రకటించారని ఆయన అన్నారు.

అనుమానాల్లో నిజం ఉందేమో తెలియదు గానీ గాంధీభవన్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి బొమ్మ లేకపోవడం వల్ల ప్రతి కార్యకర్తా బాధపడుతాడని ఆయన అన్నారు. "చేతులు జోడించి చెబుతున్నా, ఎవరినో తప్పు పట్టడానికి కాదు, మనందరి హృదయాల్లో వైయస్ ఉన్నారు, రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని మన నేత మనకు ఇచ్చిన సందేశం" అని ఆయన అన్నారు. సోనియా గాంధీ మార్గదర్శకత్వంలో నడిచి వైయస్ రాష్ట్రాన్ని ముందుకు నడిపించారని, అటువంటి నేత ఇచ్చిన సందేశాన్ని పాటించి రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దామని ఆయన అన్నారు.

యువజన కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి సీనియర్లు రిటైర్ అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్టీకి విధేయంగా ఉంటూ కష్టపడి పనిచేస్తే ఎన్నికల్లో టికెట్లు తప్పకుండా వస్తాయని, ఎలా రావో తాను చూస్తానని ఆయన అన్నారు. కష్టపడి పనిచేస్తే ఇవాళ కాకపోతే రేపు, ఎల్లుండి అవకాశాలు వస్తాయని ఆయన అన్నారు. అవకాశం వచ్చినప్పుడు సత్తాను చాటుకోవాలని, అవకాశం వచ్చే వరకు కష్టపడి పనిచేయాలని ఆయన అన్నారు.

వైయస్ బొమ్మను పూర్తిగా తుడిచేయాలని కాంగ్రెసు పార్టీకి చెందిన కొంత మంది నాయకులు డిమాండ్ చేస్తుండగా, కెవిపి మళ్లీ వైయస్ పేరును తెరమీదికి తేవడం దుమారం రేపే అవకాశం ఉంది. వైయస్ విగ్రహాలకు దీటుగా ఇందిరా గాంధీ విగ్రహాలను నెలకొల్పాలని మంత్రుల కమిటీ కూడా సూచించింది. వైయస్ విగ్రహాలతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రాజకీయం చేస్తున్న తరుణంలో కాంగ్రెసు వైయస్ పేరును వాడుకోలేని స్థితిలో పడిపోయింది. ఇప్పుడు కెవిపి వైయస్‌ను పార్టీ సొంతం చేసుకోవాలంటూ చేసిన ప్రసంగం కాంగ్రెసులో వివాదాలకు తెర తీసే అవకాశం ఉంది.

English summary
Congress Rajyasabha member KVP Ramachandar Rao once again raised the question of YS Rajasekhar Reddy issue in Congress party. He said that avert party worker is feeling sad for not having YS Rajasekhar Reddy photo in Gandhibhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X