సోనియా క్లాస్: తెలంగాణ ఎంపిలు ఉక్కిరిబిక్కిరి

తెలంగాణపై తమదైన రీతిలో ఆందోళన చేస్తామని చెప్పుకోవడానికి చేసిన కనీస ప్రయత్నానికి కూడా సోనియా ఆగ్రహం వల్ల గండిపడినట్లయింది. అయితే, ఈ విషయంపై వారు సర్దుచెప్పుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సోనియా గాంధీ తమపై ఆగ్రహం వ్యక్తం చేయలేదని, పైగా తెలంగాణ ఇస్తామని చెప్పారని వారంటున్నారు. సమైక్యవాదులు ఈ సంఘటనను తమకు వ్యతిరేకంగా వాడుకుంటున్నారని వారంటున్నారు.
సంఘటన తర్వాత తమ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, మందా జగన్నాథం సోనియాకు లేఖ రాశారని పార్లమెంటు సభ్యుడు రాజయ్య చెప్పారు. సోనియా గాంధీ తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని చెప్పుకోవడానికి తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ప్రయత్నిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు ముగిసిన తర్వాత అంటూ వారు కొత్త గడువు ఇస్తున్నారు.
మరోవైపు, ఈ నెల 20వ తేదీ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెబుతున్నారు. ఆయన ఆందోళన ఏ రూపంలో ఉంటుందనేది తెలియడం లేదు. దాన్ని ఆయన తమ మీదికే ఎక్కుపెడుతారా అనే ఆందోళన కూడా వారికి ఉంది. అయితే, పొన్నం ప్రభాకర్ వంటి ఒకరిద్దరు పార్లమెంటు సభ్యుల పట్ల కెసిఆర్ అనుకూలంగా ఉన్నట్లు ఇటీవలి వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. అయితే, కొంత మందిని ఆయన తీవ్రంగా దెబ్బ తీయాలనే ప్రయత్నంలోనే ఉన్నట్లు చెబుతున్నారు.
పైగా, తెలంగాణలో పుంజుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. తెరాసకు తామే ప్రత్యర్థులమని భావిస్తూ వస్తున్న కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులకు తాము మూడో స్థానానికో, నాలుగో స్థానానికో పడిపోక తప్పదనే అభిప్రాయం బలపడుతోంది. తెలంగాణ సమస్య ఇలాగే ఉంటే 2014 ఎన్నికల్లో తాము గెలవడం మాట అటుంచి, గౌరవప్రదమైన ఓటమిని కూడా దక్కించుకోలేమనే భావన వారిలో ఉంది. కాంగ్రెసు అధిష్టానం మాత్రం తెలంగాణ సమస్యను నాన్చే ఉద్దేశంతోనే ఉన్నట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications