అఫిడవిట్‌లోలేని ఫెరా ఉల్లంఘన: పార్థసారథికి కొత్తచిక్కు

దీంతో మంత్రిపై మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ స్పందిస్తూ.. అఫిడవిట్‌లో పూర్తి వివరాలు లేకపోతే సెక్షన్ 125ఏ ప్రకారం కేసు నమోదు చేస్తామని చెప్పారు. పార్థసారధి అఫిడవిట్ వ్యవహారంలో రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని చెప్పారు. మంత్రిని తొలగించాలంటూ బ్యానర్లను కట్టడం సరికాదన్నారు. మంత్రి తప్పుచేస్తే చర్యలు తప్పవని భన్వర్ లాల్ అన్నారు. పార్థసారథి తన అఫిడవిట్‌లో ఫెరా కేసును వెల్లడించనందున అతనిపై పై సెక్షన్ కింద కేసు నమోదయ్యే అవకాశముంది.
ఇటీవల ఆర్థిక నేరాల కోర్టు మంత్రికి ఫెరా నిబంధనలు ఉల్లంఘించినందుకు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పార్థసారథికి శిక్ష విధించిన కోర్టు అతనికి బెయిల్ ఇస్తూ అప్పీల్ చేసుకోవడానికి నెల రోజుల గడువు కూడా ఇచ్చింది. గతంలో పార్థసారధి కెపిఆర్ టెలీ ప్రొడెక్ట్స్ ఎండిగా ఉన్నప్పుడు ఫెరాను ఉల్లంఘించారంటూ 2002లో ఈడి కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు మంత్రి ఫెరాను ఉల్లాంఘించినట్లు నిర్థారించింది. రెండు నెలల జైలు శిక్ష, ఐదులక్షల జరిమానాను కోర్టు విధించగా అప్పీలు చేసుకున్న పార్థసారధి బెయిల్ తీసుకున్నారు.