హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి ఏరాసును తప్పించడానికే...: లక్ష్మీనరసింహారావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Erasu Pratap Reddy
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి బెయిల్ స్కాం కేసు నుంచి మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డిని తప్పించడానికే తనను ఇరికించారని స్కాంలో అరెస్టయి, సస్పెండై, జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న మాజీ న్యాయమూర్తి కొండపల్లి లక్ష్మినరసింహారావు ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని అంతవరకు కేసు విచారణ నిలిపి వేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌లో హోం శాఖ ముఖ్య కార్యదర్శి, సీబీఐ జాయింట్ డైరెక్టర్, ఏసీబీ డైరెక్టర్ జనరల్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సంపత్‌కుమార్, ఏసీబీ డీఎస్పీలను ప్రతివాదులుగా చేర్చారు.

గాలి బెయిల్ స్కాంలో సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా పని చేసిన లక్ష్మీనరసింహారావు కీలక పాత్ర పోషించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసింది. అయితే, ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఇప్పటికే ఆయన సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, మానవహక్కుల కమిషన్, డీజీపీ, ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జిలకు లేఖలు రాశారు. తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

లక్ష్మీనరసింహారావు దాఖలు చేసిన పిటిషన్లోని వివరాలు ఇలా ఉన్నాయి - "ఎసిబి డిఎస్పీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎసిబి పోలీసులు నాపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జూలై 11న మా ఇంట్లో సోదాలు చేశారు. ఆటవికంగా ఇంట్లోని సామాన్లను చెల్లాచెదురుగా పడేస్తూ.. దుర్భాషలాడుతూ.. భయభ్రాంతులకు గురిచేశారు. నాపై చెయ్యి చేసుకున్నారు. నన్ను ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. జేడీ సంపత్‌కుమార్ వచ్చి తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు. నా ముఖంపై ఉమ్మి వేయాలంటూ నా కుమార్తెపై ఒత్తిడి తెచ్చారు. అధికారులు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ నేను జవాబు ఇచ్చాను. తర్వాత వచ్చిన డీఎస్పీ శ్రీకృష్ణుడు నన్ను కుర్చీలోంచి లాగి చెయ్యి చేసుకున్నారు."

"రాత్రి 12 గంటల సమయంలో 18 పేజీల నోట్‌లోని చివరి పేజీలో బలవంతంగా నాతో సంతకం చేయించుకున్నారు. నాకు కాపీని ఇవ్వలేదు. అందులో ఏం రాశారో నాకు తెలియదు. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి వారం రోజులు పట్టింది. తర్వాతే నాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుసుకున్నాను. ఈ పరిణామాలను జూలై 19న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మానవ హక్కుల కమిషన్‌కు, డీజీపీకి, ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి నోటీసుకు తెచ్చాను" అని లక్ష్మీనరసింహా రావు వివరించారు.

"నా కస్టడీని కోరుతూ ఏసీబీ జూలై 17న కోర్టులో పిటిషన్ వేసింది. గాలి బెయిల్ డీల్‌కు సంబంధించి నేను మధ్యవర్తుల సమక్షంలోనే వాంగ్మూలం ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. ఈ కేసులో సహ నిందితుడు ఇచ్చిన మౌఖిక వాంగ్మూలం ఆధారంగా ఈ కథ అంతా నడిపించారు. చట్టప్రకారం దానికి విలువ లేదు. రవిచంద్ర చెప్పిన మాటలు, జడ్జి పట్టాభి రామారావు సంతకం చేయని స్టేట్‌మెంట్ ఆధారంగా నాపై కేసు నమోదు చేశారు" అని అన్నారు.

"ఈ స్కాంలో సస్పెండైన జడ్జి పట్టాభి రామారావును, మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డిని కాపాడడం కోసమే మొత్తం కేసును నీరుగార్చారు. క్రిష్ణప్రసాద్, వెంకటేశ్వరరావులను కస్టడీలోకి తీసుకుని అరెస్టు చేస్తామని భయపెట్టి బలవంతంగా 164 స్టేట్‌మెంట్లను తీసుకున్నారు. వాటికి మీడియాలో విస్త్రృత ప్రచారం కల్పించి మొత్తం కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు. ఏసీబీ జేడీ సంపత్‌కుమార్ ఎప్పుడో పదవీ విరమణ చేశారు. న్యాయ శాఖ దయాదాక్షిణ్యాలపై నెట్టుకు వస్తున్నారు" అని అన్నారు.

"డీజీపీ దినేశ్ రెడ్డికి ఆయన సన్నిహితుడు. డీజీపీ- మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి వియ్యంకులు. గాలి బెయిలు స్కాంలో జడ్జి పట్టాభి రామారావు, ఆయన కుమారుడు రవిచంద్రతోపాటు మంత్రి ఏరాసు పేరు కూడా విస్తృత ప్రచారంలోకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తును సంపత్ కుమార్ చేపట్టిన తర్వాత వాస్తవాలు వెలికిరాకుండా తొక్కిపెట్టడానికి ప్రయత్నాలు చేపట్టారు. మంత్రి ఏరాసును కాపాడడానికి పట్టాభి, రవిచంద్రలను రక్షణ కవచంగా వాడుకుని.. తప్పుడు స్టేట్‌మెంట్లు ఇచ్చేలా వారిపై ఒత్తిడి చేసి రాయించుకున్నారు" అని లక్ష్మినరసింహారావు అన్నారు..

"పదవీ విరమణ చేసిన అధికారితో కేసు దర్యాప్తు చేయించి న్యాయ శాఖా మంత్రికి వ్యతిరేకంగా ఉన్న అన్ని ఆధారాలను కనుమరుగు చేయించారు. నా కంటే జూనియర్ అయిన లా సెక్రటరీ ఎ.శంకరనారాయణ (ఆయన సోదరుడు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి) కలిసి నాపై కుట్ర చేశారు. ఈ కేసులో పట్టాభి బెయిలుకు సహకరిస్తామని ఆయన సన్నిహితుడైన రమణమూర్తి నుంచి న్యాయ సలహా తీసుకుని మంత్రిని తప్పించడానికి పథక రచన చేశారు. ఈ కేసులో మంత్రి ఏరాసును రక్షించడానికి జేడీ సంపత్‌కుమార్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు" అని ఆరోపించారు.

"వారి సెల్‌ఫోన్ నెంబర్లు, టవర్ లోకేషన్స్ పరిశీలిస్తే వాస్తవాలు వెలికి వస్తాయి. ఈ కేసును ఏసీబీ నుంచి సీబీఐకి బదిలీ చేసి దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలికి వస్తాయి'' అని పిటిషన్‌లో లక్ష్మీ నరసింహారావు వివరించారు. కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులపై తనకు ఏమాత్రం విశ్వాసం లేదని, విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని పేర్కొన్నారు. కేసు దర్యాప్తును నిలిపి వేయాల్సిందిగా ఏసీబీ అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

English summary
Laxmi Narasimha Rao, suspended as judge alleged that ACB has indicted in Karnataka former minister Gali Janardhan reddy's bail scam case to protect Law minister Erasu Pratap Reddy. He filed a petition in High Court in this effect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X