• search
  • Live TV
నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్రధాని తెలంగాణ వ్యతిరేకి: మధు యాష్కీ సంచలనం

By Pratap
|

Madhu Yashki
నిజామాబాద్/ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాని మన్మోహన్‌సింగ్ అనుకూలంగా లేరని నిజామాబాద్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీగౌడ్ సంచలన వ్యాఖ్య చేశారు. అందుకే రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరుగుతోందని శుక్రవారం ఆయన నిజామాబాద్ జిల్లా పోచంపాడ్‌లో వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాంత నాయకులైన రేణుకా చౌదరి, శశిధర్‌రెడ్డిలు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు పూటకో మాట మారుస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఏ సంకేతాలు ఉన్నాయో తెలియదు కానీ తమకెలాంటి సంకేతాలు లేవని తేల్చి చెప్పారు. తెలంగాణ ఏర్పాటు జరగాలంటే అందరూ ఐకమత్యం గా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఆంధ్ర ప్రాంతంలో ఒక కొబ్బరిచెట్టు కూలిపోతేనే బీమా చెల్లిస్తున్నారని, అదే తెలంగాణలో మాత్రం రైతులు చనిపోయినా దిక్కు లేదని మధు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంలోనే తెలంగాణ ఏర్పాటవుతుందని ధీమాగా చెప్పారు.

ఫీజు చెల్లింపులపై విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వాన్‌పిక్ భూముల వ్యవహారంలో తెలుగుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కలిసి రూ.55కోట్ల మేర ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు.

తెలుగుతల్లిని ముక్కలు చేస్తారా..

నన్నయ్య ఆదికవి కాదని, పాల్కురికి సోమనాథుడే ఆదికవి అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చెబుతున్నారని, అలాగే తెలుగుతల్లి ఆంధ్రాకే పరిమితమని, తెలంగాణకు తెలంగాణ తల్లి అని చెబుతున్నారని, రాజకీయ స్వార్థం కోసం సాహిత్యకారులు, చరిత్రకారులను వివాదాల్లోకి లాగడం దారుణమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మల్లెల లింగారెడ్డి శుక్రవారంనాడు హైదరాబాదులో వ్యాఖ్యానించారు.

తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిది నన్నయ్య కవితా యుగమేనని, అలాగే ఆయన భారతాన్ని అనువాదం చేయలేదని, అది ఆయన సృష్టేనన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నన్నయ్యను ఒక ప్రాంతానికి పరిమితం చేయడం తగదని కేసీఆర్‌కు లింగారెడ్డి హితవు పలికారు. పాల్కురికి సోమనాథుడు కన్నడ కవితా లక్షణాలను అలవర్చుకున్న కవి అని, సి. నారాయణరెడ్డి, కాళోజీ వంటి కవులు అన్ని ప్రాంతాలకు చెందినవారని, అలాంటివారిని కూడా ఒక ప్రాంతానికే పరిమితం చేయొద్దని సూచించారు.

"భారత మాత అంటే ఉత్తర, దక్షణ, మధ్య భారతమాతలుండరు. భారత జాతి మొత్తానికీ ఆమే తల్లి. అదో మధుర భావన. అలాగే తెలుగుతల్లి కూడా తెలుగు ప్రజలకు ఓ మధుర భావన. అలాంటి తెలుగు తల్లిని ముక్కలు చేసి, దానితో నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకుని ఎదుగుతామంటే కుదరదు'' అని కేసీఆర్‌కు స్పష్టం చేశారు. నన్నయ్య ఆదికవి కాదంటూ చేసిన వ్యాఖ్యలపై తెలుగు సాహితీ లోకానికి, తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేసీఆర్‌ను లింగారెడ్డి డిమాండ్ చేశారు.

శనివారం జరగనున్న పొలిట్‌బ్యూరో సమావేశంలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటారా? అని ప్రశ్నించగా.. "తెలంగాణ విషయమై మా పార్టీ గతంలోనే లేఖ ఇచ్చింది. చేతనైతే ఆ లేఖను ఉపయోగించుకుని తెలంగాణను తెచ్చుకోమనండి'' అని కేసీఆర్‌నుద్దేశించి చెప్పారు.

English summary
Congress Nizamabad MP Madhu Yashki alleged that PM Manmohan Singh is anti Telangana. He said that he is not having any indications on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X