రంగంలోకి బాలయ్య: గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి భేటీ

గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో రావి వెంకటేశ్వర రావు బాలకృష్ణను కలిశారు. రావి వెంకటేశ్వర రావును ఆయన తెలుగదేశం పార్టీలోకి అహ్వానించారు. బాలకృష్ణ సూచన మేరకు తాను త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు రావి వెంకటేశ్వర రావు చెప్పారు. దీంతో వచ్చే ఎన్నికల్లో గుడివాడలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసే కొడాలి నానిపై రావి వెంకటేశ్వర రావును పోటీకి దించుతారని అనుకుంటున్నారు.
కాగా, గుడివాడ నుంచి బాలకృష్ణ పోటీ చేసే అవకాశాలున్నట్లు జరుగుతున్న ప్రచారానికి తాజా పరిణామంతో తెర పడినట్లేనని భావిస్తున్నారు. రావి వెంకటేశ్వ రావును గుడివాడలో గెలిపించే బాధ్యతను బాలకృష్ణ తన భుజం మీద వేసుకునే అవకాశాలున్నాయి. అలాగే, బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి శానససభకు పోటీ చేయడానికి మానసికంగా సిద్ధపడినట్లు చెబుతున్నారు.
బాలకృష్ణ తండ్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు హిందూపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అది ఒక రకంగా ఎన్టీ రామారావుకు ఇష్టమైన నియోజకవర్గం కూడా. దీంతో హిందూపురంలో పోటీ చేయడం ద్వారానే శాసనసభలోకి అడుగు పెట్టాలని బాలకృష్ణ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, తన కుమారుడు మోక్షజ్ఞను సినిమాల్లో ప్రవేశపెట్టేందుకు బాలకృష్ణ ఏర్పాట్లు చేస్తున్నారు. తాను రాజకీయాల్లోకి పూర్తిగా కాలు పెట్టడం, తన కుమారుడు సినిమాల్లో ప్రవేశించడం రెండూ ఒకేసారి జరగాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications