• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అన్నింటికి వైయస్ ఫ్యామిలీయే, కిరణ్‌కు భయం: బాబు

By Srinivas
|

Chandrababu Naidu
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కుర్చీ భయం పట్టుకుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విమర్శించారు. కుంభకోణాలన్నింటికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబమే కారణమని బాబు ఆరోపించారు. వాన్ పిక్ కు భూములు కేటాయిస్తూ జారీ చేసిన జివోల్ని తక్షణం రద్దు చేయాలని, 2008కి ముందు ఆ భూములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయో తిరిగి వారికే అప్పగించాలని డిమాండ్ చేశారు.

మంగళవారం వివిధ సందర్భాలలో చంద్రబాబు హైదరాబాద్, విజయవాడలలో మాట్లాడారు. రైతులు వాన్ పిక్ కోసం భూమిని ఇవ్వకపోతే భయపెట్టి ఒప్పించిన సందర్భాలు ఉన్నాయన్నారు. రైతులను బెదిరించి దౌర్జన్యంగా భూములు లాక్కోవడం దుర్మార్గమన్నారు. వాన్‌పిక్‌కు భూములు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఉపాధికి ఇబ్బంది లేకుండా పాడి పశువులు ఇస్తామని, తుఫాన్లకు కూడా చెక్కు చెదరని ఇళ్లు కట్టించి ఇస్తామని అరచేతిలో స్వర్గం చూపించారని, ఇందులో ఒక్కటీ జరగలేదని చంద్రబాబు ఆరోపించారు.

వాన్‌పిక్ కోసం అక్రమ పద్ధతుల్లో భూకేటాయింపులు జరిపారని సిబిఐ నిర్ధారించినందువల్ల తక్షణం ఆ కేటాయింపులను రద్దుచేయాలని డిమాండ్‌చేశారు. వాన్‌పిక్ ప్రాజెక్టు కోసం 4వేల ఎకరాలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయిస్తే దానిని తుంగలో తొక్కి 28వేల ఎకరాలు ఇచ్చారని విమర్శించారు. బివొటి పద్ధతిలో భూములు ఇవ్వాలన్న నిర్ణయానికి పాతరేసి శాశ్వతంగా ఆ భూములను ఇచ్చేశారన్నారు. వాన్‌పిక్ పోర్టు సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొంటే తర్వాత ఈ భూములను అదే పేరుతో పెట్టిన వాన్‌పిక్ ప్రాజెక్ట్సు అనే సంస్థకు బదిలీ చేశారు.

రైతులకు ఒక్కో ఎకరానికి రూ. 3-6 లక్షల వరకూ ఇచ్చినట్లు రికార్డుల్లో రాసి అందులో సగంలోపే చెల్లించారు. అక్కడకు వెళ్తే హృదయ విదారక గాథలు వినాల్సి వస్తోంది'' అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఒప్పించి భూములు ఇప్పించి తమ వంతు కమీషన్లు కూడబెట్టుకోవడమే పనిగా వ్యవహరించారని రైతుల గోడు ఎవరికీ పట్టలేదని విమర్శించారు. వాన్‌పిక్ దోపిడీ సొమ్ములో రూ. 854 కోట్లు.. సాక్షి దాని అనుబంధ కంపెనీలకు వెళ్లిందని ఆరోపించారు. ఏ మాత్రం తెలివిలేని, పెట్టుబడి లేని వాళ్లను కోటీశ్వరుల్ని చేసే పథకాన్న నాటి వైయస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. కుంభకోణాలన్నింటికి వైయస్, ఆయన కుటుంబమే కారణమన్నారు.

అక్రమాలు రుజువైనందువల్ల వాన్‌పిక్ ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసి సంబంధిత జీవోలను కూడా రద్దు చేయాలని, భూముల క్రయవిక్రయాలపై నిషేధం ఎత్తివేసి ఉద్యమిస్తున్న రైతులపై పెట్టిన కేసులు కూడా ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. దేవాలయంలోకి చొరబడి దౌర్జన్యంగా తాళాలు వేసిన మంత్రి దానం నాగేందర్ జోలికి వెళ్లే సాహసం చేయలేకపోయిన ప్రభుత్వం ప్రజా సమస్యలపై ఉద్యమించిన టిడిపి ఎమ్మెల్యేలను మాత్రం అక్రమంగా అరెస్టు చేస్తోందని చంద్రబాబు విమర్శించారు.

పవర్ ప్లాంటు వద్ద చోటు చేసుకొనే కాలుష్య సమస్యలపై ఉద్యమించినందుకు శ్రీకాకుళం జిల్లాలో తమ ఎమ్మెల్యే సాయిరాజ్‌పై రెండేళ్ల కిందట పెట్టిన కేసులో ఇప్పుడు అరెస్టు చేశారని ఆయన వెల్లడించారు. గుంటూరు జిల్లాలో తమ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును మరీ అన్యాయంగా ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. తన పదవిని కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి తన మంత్రులను ఏమీ అనే సాహసం చేయలేకపోతున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే చివరకు ఆయన తన పదవిని కూడా వదులు కోవాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు.

ముఖ్యమంత్రి మార్పు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని, అయినా 'పళ్లూడగొట్టుకోవడానికి ఏ రాయి అయినా ఒకటే'నని ఒక ప్రశ్నకు సమాధానంగా ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టడం తన చేతిలో లేదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన ఖర్మ తనకు పట్టలేదని చెప్పారు. విద్యార్థుల ఫీజుల చెల్లింపు వ్యవహారంలో ప్రభుత్వం ఆషామాషీగా వ్యవహరిస్తోందని, గురువారంలోగా ఈ సమస్యను పరిష్కరించకపోతే ఆ రోజు నుంచే భారీ ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. అసమర్థత వల్లే ప్రతి సమస్యను ప్రభుత్వం జటిలం చేసుకొంటోందని ఆయన విమర్శించారు.

English summary
Telugudesam party chief Nara Chandrababu Naidu has blamed YS Rajasekhar Reddy family for state scams. He also lashed out at CM Kiran Kumar Reddy for his attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X