ధర్మాన ఇష్య్యూ: గవర్నర్‌తో ముఖ్యమంత్రి చర్చలు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గవర్నర్ నరసింహన్ తేనీటి విందుకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన గవర్నర్‌తో మాట్లాడారు. ఓ వైపు పార్టీ అధిష్టానంతో మాట్లాడుతూనే కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్ సలహాను కూడా కోరారు. ధర్మాన వైఖరి, సిబిఐ ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని కోరడం, న్యాయనిపుణుల సలహాలు వంటి వివరాలను గవర్నర్‌తో ఆయన మాట్లాడారు. విషయాలు చెప్పిన తర్వాత గవర్నర్ స్పందన వచ్చే వరకు ధర్మాన రాజీనామా విషయాన్ని పక్కన పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
గవర్నర్ స్పందన వచ్చే సరికి మరో రెండు మూడు రోజులు పట్టవచ్చునని అంటున్నారు. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని సిబిఐ కోరిన నేపథ్యంలో ముఖ్యమంత్రి న్యాయనిపుణులను సంప్రదించారు. సిబిఐ విజ్ఞప్తిని గవర్నర్‌కు పంపుతూ అది మోపిన అభియోగాలపై ధర్మాన ఇచ్చిన వివరణను జత చేసే అవకాశం ఉంది. సహజ న్యాయంలో భాగంగా ధర్మాన స్పందనను రాతపూర్వకంగా తీసుకున్నారు.
ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని గవర్నర్ సూచిస్తే వెంటనే ధర్మాన రాజీనామాను ఆమోదించాల్సి వస్తుంది. ఒక వేళ ప్రాసిక్యూషన్ అవసరం లేదని, న్యాయపోరాటం చేసుకోవచ్చునని గవర్నర్ సూచిస్తే రాజీనామాను ముఖ్యమంత్రి తిరస్కరించే అవకాశాలుంటాయి. అందుకే ధర్మాన రాజీనామాను ఆమోదించకుండా ముఖ్యమంత్రి పక్కన పెట్టారు.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో వాన్‌పిక్ వ్యవహారంలో సిబిఐ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో ధర్మాన ఐదో నిందితుడు. ఈ నేపథ్యంలో ధర్మాన ప్రసాద రావు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పించారు.












Click it and Unblock the Notifications