తిరుపతిని హిందూ కేంద్రంగా ప్రకటిస్తేనే: పరిపూర్ణానంద

టిటిడిలో అన్యమత ప్రచారాన్ని అరికట్టాలని, హైందవేతర ఉద్యోగులను తొలగించాలని డిమాండ్ చేస్తూ తిరుమల తిరుపతి సంరక్షణ సమితి ఆధ్వర్యంలో టిటిడి పరిపాలనా భవనం ఎదుట శనివారం దీక్ష చేపట్టారు. టిటిడిలో ఉద్యోగులు అన్యమత ప్రచారంలో పాల్గొనడంపై పరిపూర్ణానంద ఆందోళన వ్యక్తం చేశారు. శేషాచలం చుట్టూ 30 కిలోమీటర్ల వరకు అన్యమత ప్రచారం జరగకుండా జీవో ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హిందూమత వ్యాప్తి, ధర్మ ప్రచారం కోసం మఠాధిపతులు, పీఠాధిపతులతో త్వరలో రథయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.
బాటల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, మొద్దు నిద్ర వీడి తిరుమల పవిత్రతను కాపాడే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత ఉప ఎన్నికలలో తిరుమల పవిత్రతను కాపాడుతానని చెప్పిన ముఖ్యమంత్రి అన్యమత ప్రచారం జరుగుతుంటే ఎందుకు మిన్నకుండి పోయారని ప్రశ్నించారు. వాటికన్ సిటీ, మక్కా తరహాలో తిరుపతిని హిందూ ప్రాంతంగా ప్రభుత్వం తీర్చి దిద్దాలని, అందుకు తితిదే కృషి చేయాలన్నారు.
టిటిడిఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యానికి వినతిపత్రం ఇచ్చారు. ఈ దీక్షలో విశ్రాంత డిజిపి టిఎస్ రావు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పర్వతరావు, తిరుమల తిరుపతి సంరక్షణ సమితి కార్యదర్శి లక్ష్మణాచార్య, మనోహరరావు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. శిథిలావస్థలో ఉన్న శ్రీవారి తల్లి వకుళమాత ఆలయాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పరిపూర్ణానంద స్వామి భక్తులతో కలసి తిరుపతి సమీపంలో ఉన్న పేరూరులోని వకుళమాత ఆలయాన్ని సందర్శించనున్నారు.












Click it and Unblock the Notifications