అసెంబ్లీ పైకి ఎక్కిన నన్నపనేని: దూకుతానని బెదిరింపు

రైతులకు వెంటనే ఏడు గంటల విద్యుత్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ కోతలపై మాట్లాడుతుందే తప్ప ఆ సమస్యను పరిష్కరించే దిశలో ఆలోచించడం లేదన్నారు. విద్యుత్ కోతలపై కిరణ్ వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేసేందుకు పోలీసులు నిరాకరించడంతో అసెంబ్లీ ప్రాంగణంలో వారు ధర్నాకు దిగారు.
ఈ సమయంలో నన్నపనేని అసెంబ్లీ పైకి ఎక్కారు. అసెంబ్లీ ప్రాంగణంలోని టిడిఎల్పీ భవనం పైకి ఆమె ఎక్కి ఆందోళన కొనసాగించారు. సమస్య పరిష్కారంపై సిఎం హామీ ఇవ్వాలని లేదంటే తాను భవనంపై నుండి దూకుతానని హెచ్చరించారు. ఆమె పై నుండి దూకుతానని హెచ్చరించడంతో అక్కడ కాసేపు గందరగోళం ఏర్పడింది. సొంతపార్టీ నేతలు ఆమెను బుజ్జగించి కిందకు తీసుకు వచ్చారు. నన్నపనేని అసెంబ్లీ పైకి ఎక్కడంతో కాసేపు అక్కడ హడావుడి నెలకొంది.
అనంతరం కిందకి దిగి వచ్చిన ఆమె మాట్లాడుతూ... తాము కొంతకాలంగా విద్యుత్ సమస్యలపై ఉద్యమిస్తున్నామని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. విద్యుత్ కోతలపై ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోవడం లేదని ఆరోపించారు. సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన తెలియజేయాలని చూశానని అన్నారు. సిబ్బంది వచ్చి అరెస్టు చేసే పరిస్థితి వస్తేనే తాను నిరసన తెలియజేసే ఉద్దేశ్యంతో భవనంపైకి ఎక్కానని చెప్పారు.
విద్యుత్ సమస్య పరిష్కారం కోసం అసెంబ్లీని వెంటనే సమావేశ పర్చారని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మహాత్ముడి విగ్రహం వద్దకు తమకు అనుమతించాలన్నారు. టిడిపి ఆందోళనపై కిరణ్ కుమార్ స్పందించారు. త్వరలో విద్యుత్ సమస్యలను అధిగమిస్తామని చెప్పారు. అందరూ సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి సారించాలని సూచించారు.












Click it and Unblock the Notifications