అదృశ్యమైన ఏఎస్పీ నవీన్ ప్రత్యక్షం, రాత్రి అదుపులోకి

రాత్రి ఓ ప్రైవేటు బస్సులో హైదరాబాద్ వెళ్తుండగా రోడ్‌కం రైలు బ్రిడ్జి వద్ద బస్సును ఆపి ఆయనను తీసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ, నవీన్ కథనం మాత్రం వేరేలా ఉంది. మధ్యాహ్నం ఇద్దరు మనుషులు వచ్చి రాజమండ్రి అర్బన్ ఎస్పీ రమ్మన్నారంటూ తనను తీసుకెళ్లారని, కానీ రాజమండ్రి తీసుకెళ్లకుండా రావులపాలెం వరకు జీపులో తీసుకెళ్లడంతో తనకు అనుమానం వచ్చి.. ఎక్కడకు వెళ్తున్నారంటూ గట్టిగా నిలదీయగా, తన దగ్గర వెపన్ కూడా ఉండటంతో భయపడి అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయారని ఆయన విలేకరులకు తెలిపారు. తాను హైకోర్టును ఆశ్రయించేందుకే హైదరాబాదు వెళ్లేందుకు బయలుదేరినట్లు చెప్పారు.
తనకు పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని, అందుకే అక్కడినుంచి రాజమండ్రి వచ్చి, హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు మళ్లీ పట్టుకుని గెస్ట్‌హౌస్ వద్దకు తీసుకొచ్చారని చెప్పారు. మరోవైపు.. హైదరాబాద్ వెళ్తున్న నవీన్ కుమార్‌ను పట్టుకుని తీసుకొచ్చామని, సస్పెన్షన్ నోటీసులు ఆయన చేతికి ఇచ్చామని రాజమండ్రి సౌత్‌జోన్ డీఎస్పీ రాజగోపాల్ తెలిపారు. నవీన్ కుమార్‌కు ప్రాణహాని కలిగించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని, ఆయనకేమైనా అయితే వాళ్లే బాధ్యత వహించాలని మానవహక్కుల కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు హెచ్చరించారు.
బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు నవీన్ అదృశ్యం వార్త తొలిసారి బయటకు రాగా, తర్వాత రాత్రి పది గంటల తర్వాత మాత్రమే గెస్ట్‌హౌస్ వద్ద ఆయన ఆచూకీ తెలిసింది. ఈ ఏడున్నర గంటల పాటు నవీన్ కుమార్ ఏమయ్యారన్నది చిక్కుముడిగానే ఉంది. సస్పెన్షన్ ఉత్తర్వులు అందివ్వడానికి ఏలూరు నుంచి ఏఆర్ డీఎస్పీ అశోక్ బుధవారం బయల్దేరారు. నవీన్ రాజమండ్రిలో ఉన్నట్లు తెలుసుకుని నేరుగా రాజమండ్రిలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. నవీన్ కుమార్ కొద్దిసేపట్లో వస్తారని బంధువులు చెప్పినట్లు డీఎస్పీ అశోక్ అంటున్నారు. కానీ, బంధువులు మాత్రం.. అప్పటికే కొందరు వ్యక్తులు వచ్చి ఆయనను తీసుకెళ్లినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications