కూతురు కోసమే జగన్ పార్టీలోకీ ఉప్పునూతల?

2014 సాధారణ ఎన్నికలలో తిరిగి కాంగ్రెసు అధికారం చేజిక్కించుకుంటుందో లేదో అనే అనుమానాలు అందరిలోనూ బలపడ్డాయి. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పరకాల ఉప ఎన్నికలలో అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని కాదని తెలంగాణే లక్ష్యంగా ఉద్యమిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ముచ్చెమటలు పోయించింది.
కేవలం పదిహేను వందలకు పైగా ఓట్లతోనే తెరాస అభ్యర్థి గట్టెక్కారు. దీంతో జగన్ తెలంగాణపై క్లారిటీ ఇవ్వనప్పటికీ వైయస్సార్ కాంగ్రెసు తెలంగాణలో బలమైన పార్టీగా ఎదుగుతుందనే అభిప్రాయానికి దాదాపు అందరూ వచ్చారు. ఇక ఉప్పునూతల కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని సమాచారం. అయితే ఆయన జగన్ పార్టీలో చేరడానికి గల కారణం ఆయన కోసం కాదని... ఆయన కూతురు కోసమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
వచ్చే సాధారణ ఎన్నికలలో తన కూతురును భువనగిరి పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయించే ఉద్దేశ్యంతో ఉప్పునూతల ఉన్నారని అంటున్నారు. అప్పుడు కాంగ్రెసు టిక్కెట్ ఇస్తుందో లేదో ఇచ్చినా గెలుస్తామో లేదో అనే అనుమానాలు ఉప్పునూతలలో కలిగిందట. అందుకే జగన్ పార్టీతో సంప్రదింపులు జరిపి... తన కూతురుకు భువనగిరి బెర్త్ ఖాయం చేసుకున్న తర్వాత అతను జగన్ పార్టీకి జై కొట్టారని అంటున్నారు.












Click it and Unblock the Notifications