చిరును అనలేదు, జగన్ పార్టీని అన్నాను: బొత్స

తాను చిరంజీవిని ఉద్ధేశించి అనలేదని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్ధేశించి మాత్రమే అన్నానని ఆయన తెలిపారు. కాగా, కొన్ని టివీ చానళ్ళలో రాత్రిళ్లు అశ్లీల కార్యక్రమాలు ప్రసారమవుతుండటంపై ఈ సందర్భంగా బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. తమది వంశ పారంపర్య పార్టీ కాదని బొత్స సత్యనారాయణ తెలిపారు. టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ రాజకీయ అరంగేట్రం చేయడం, బుధవారం చిత్తూరులో మాట్లాడుతూ ‘నేను పార్టీలో కార్యకర్తగా ఉంటానని, నాన్న వెంట పాదయాత్రలో పాల్గొంటాను' అని చెప్పిన సమయంలోనే బొత్స ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇటీవల మరణించిన పిసిసి లింగ్విస్టిక్ మైనారిటీ అధ్యక్షుడు అశోక్ సింగ్ సంతాప సభ గాంధీభవన్‌లో పార్టీ నిర్వహించింది. ఈ సందర్భంగా అశోక్‌సింగ్‌కు సంతాపం వ్యక్తం చేసిన అనంతరం బొత్స మాట్లాడుతూ అశోక్‌సింగ్ సేవలను పార్టీ ఎప్పటికీ మరవదని అన్నారు. అంతకుముందు పిసిసి ప్రధాన కార్యదర్శి జి.నిరంజన్ మాట్లాడుతూ పాతనగరంలో పార్టీ జెండాలు మోస్తున్న కార్యకర్తలకు గుర్తింపు రావడం లేదని చెప్పడంపై బొత్స స్పందించారు.
అంకిత భావంతో పని చేసే నాయకులకు, కార్యకర్తలకు గుర్తింపు తప్పకుండా లభిస్తుందని అన్నారు. ప్రాంతాలకు, కుల, మతాలకు అతీతంగా కార్యకర్తలను చూస్తామని ఆయన స్పష్టంచేశారు. తమ కుటుంబంలో పూర్వీకులు ఎవరూ రాజకీయాల్లో లేరని, తానే మొదట వచ్చానని, ఎంతో కష్టపడ్డానని ఆయన చెప్పారు. ఎఐసిసి నాయకుడు, పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు మాట్లాడుతూ అశోక్‌సింగ్ చేసిన సేవలను కొనియాడారు. ఎమ్మెల్సీ కెఆర్ ఆమోస్ పాల్గొన్నారు.
పార్టీని మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈ నెలాఖరున సదస్సు నిర్వహించాలనుకుంటున్నట్లు బొత్స తెలిపారు. 27వ తేదీన సదస్సు నిర్వహించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో బొత్స కలిశారు. మహాకవి గురుజాడ అప్పారావు ఉత్సవాలను ఈ నెల 19 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు బొత్స తెలిపారు. 19న ఈ ఉత్సవాలను విజయనగరంలో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. 21న హైదరాబాద్‌లో నిర్వహించే సదస్సుకు గవర్నర్ నరసింహన్‌ను ఆహ్వానించేందుకే రాజ్‌భవన్ వెళ్ళానని ఆయన స్పష్టంచేశారు.