90 రోజుల్లో 3700 స్టాక్ లావాదేవీలతో ట్రంప్ షాక్..! ఆవాక్కైన వాల్ స్ట్రీట్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అంటే ఇరాన్ యుద్దం విషయంలోనో, లేక ప్రపంచ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అంశంలోనో వార్తలు చూస్తుంటాం. కానీ అంతకు మించి ఆయన చేస్తున్న వ్యాపారం చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ట్రంప్ లేదా ఆయన సలహాదారులు 3,700కి పైగా స్టాక్ ట్రేడ్‌లు నిర్వహించినట్లు తాజాగా వెల్లడైంది. ప్రభుత్వ విధానాలు, నియంత్రణ నిర్ణయాలచే ప్రభావితమయ్యే కంపెనీల లావాదేవీలే ఇందులో ఉన్నాయి. దీంతో ట్రంప్ అటు అధ్యక్షుడిగానూ, ఇటు స్టాక్ వ్యాపారిగానూ డబుల్ గేమ్ ఆడుతున్నట్లు అర్దమవుతోంది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, అమెజాన్, బోయింగ్ వంటి అతిపెద్ద టెక్, ఫైనాన్స్, ఏరోస్పేస్, మీడియా కంపెనీలలో పదుల మిలియన్ల డాలర్ల ట్రేడింగ్ జరిగింది. ఈ కంపెనీలన్నీ ట్రంప్ సర్కార్ నిర్ణయాలతో తీవ్రంగా ప్రభావితమయ్యే రంగాలలో ఉన్నవే. ఈ ఏడాది జనవరి నుండి మార్చి మధ్య ట్రంప్ రోజుకు సగటున 40కి పైగా వాటాలను ట్రేడ్ చేశారు. 2025 చివరి మూడు నెలల్లో కేవలం 380 లావాదేవీలు జరిగాయి. దీంతో పోలిస్తే ప్రస్తుత త్రైమాసికంలో ట్రేడింగ్ సంఖ్య విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

టటిల్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ సీఈవో మాథ్యూ టటిల్.. ఈ ట్రేడింగ్ స్థాయిని నమ్మశక్యం కాని సంఖ్యగా అభివర్ణించారు. ఇది భారీ అల్గో ట్రేడ్‌లను నిర్వహించే ఒక హెడ్జ్ ఫండ్‌లా ఉందని బ్లూమ్‌బెర్గ్‌కు తెలిపారు. ఇతర వాల్ స్ట్రీట్ నిపుణులు సైతం అధ్యక్షుడికి ఇంత పెద్దఎత్తున ట్రేడింగ్ అసాధారణమని పేర్కొన్నారు. తాను నివ్వెరపోయానని, వాల్ స్ట్రీట్‌లో నా 40+ సంవత్సరాల అనుభవంలో, ఇది ఏ ప్రమాణాల ప్రకారం చూసినా అసాధారణమని ది వెల్త్ అలయన్స్ ప్రెసిడెంట్ ఎరిక్ డిటాన్ తెలిపారు.
తాజాగా వెల్లడైన వివరాల ప్రకారం ట్రంప్.. ఈ త్రైమాసికంలో ఎన్విడియా, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, బోయింగ్, కోస్ట్ కో వంటి కంపెనీలలో కనీసం 1 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను కొన్నారు. అమెజాన్, మెటా, ఉబెర్, ఈబే, అబాట్, ఏటీ&టీ, డాలర్ ట్రీ వంటి కంపెనీలు ఆయన ట్రేడింగ్ జాబితాలో ఉన్నాయి. ఫిబ్రవరి 10న మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ తన పెట్టుబడులను 5 మిలియన్ల నుండి 25 మిలియన్ల డాలర్ల మధ్య విక్రయించగా.. ఇది అతి పెద్ద లావాదేవీగా నమోదైంది. నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, పారామౌంట్ గ్లోబల్ వంటి మీడియా, ఎంటర్ టైన్మెంట్ డీల్‌లలో పాలుపంచుకున్న కంపెనీలలో కూడా ట్రంప్ కు పెట్టుబడులున్నాయి. దీంతో ట్రంప్ అధ్యక్ష స్దానంలలో ఉంటూ వ్యాపారాలు చేస్తూ పరస్పర ప్రయోజన వైరుధ్య వివాదంలో చిక్కుకుంటున్నారు.

ఈ కంపెనీలలో చాలా వరకు అమెరికా ప్రభుత్వ విధానాలు, నిబంధనలు, భౌగోళిక రాజకీయ నిర్ణయాలతో నేరుగా ప్రభావితమయ్యే రంగాలలో ఉంటాయి. ఉదాహరణకు చైనాకు అధునాతన ఏఐ చిప్‌ల ఎగుమతికి ఎన్విడియాకు అమెరికా అనుమతులు అవసరం.బోయింగ్ అమెరికా ప్రభుత్వంతో ముడిపడిన రక్షణ, ఏరోస్పేస్ కాంట్రాక్ట్‌లపై ఆధారపడి ఉంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి పెద్ద టెక్ కంపెనీలు గుత్తాధిపత్య విచారణలు, ఏఐ నియంత్రణ చర్చలు, ఫెడరల్ విధాన నిర్ణయాలతో నిరంతరం ప్రభావితమవుతాయి. చట్టాలను ఉల్లంఘించకపోయినా, ప్రస్తుత అధ్యక్షుడు ఇంత దూకుడుగా ట్రేడింగ్ నిర్వహించడం సంభావ్య ప్రయోజన వైరుధ్యాలపై తీవ్ర ఆందోళనలు రేకెత్తుతాయని విమర్శకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications