విజయ్ సర్కార్‌కు స్టాలిన్ సహకారం.. కానీ బురదజల్లితే ఊరుకోం!
తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికల అనంతరం వేడి ఇంకా చల్లారలేదు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత డీఎంకే అధ్యక్షుడు, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. కొత్తగా ఏర్పడిన టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి సహకారం అందిస్తామని ప్రకటించిన స్టాలిన్, అదే సమయంలో తమ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తే గట్టిగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించడం ఆసక్తికరంగా మారింది.
సోషల్ మీడియా వేదికగా స్పందించిన స్టాలిన్.. ప్రభుత్వం పాలన సాగించనివ్వాలని, డీఎంకే అడ్డంకిగా మారదని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డీఎంకేపై దుష్ప్రచారం చేస్తే మౌనంగా ఉండబోమని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే వాటిని వెంటనే బయటపెడతామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో అధికార పార్టీ టీవీకే, ప్రతిపక్ష డీఎంకే మధ్య మాటల యుద్ధానికి నాంది పలికినట్టైంది.

ఇటీవల తంజావూరులో పార్టీ కార్యకర్త కుటుంబ వివాహ వేడుకకు హాజరైన స్టాలిన్, అక్కడ పార్టీ శ్రేణులతో కలిసిన సందర్భాన్ని కూడా ప్రస్తావించారు. తిరుచిరాపల్లిలో దిగిన నాటి నుంచి కార్యకర్తలు చూపించిన భావోద్వేగ స్పందన తనకు బలాన్నిచ్చిందని అన్నారు. మన మధ్య మాటలు అవసరం లేదని, కార్యకర్తల భావోద్వేగం తనకు అర్థమైందని వ్యాఖ్యానించడం ద్వారా ఓటమి తర్వాత కూడా తన పట్టు తగ్గలేదని సంకేతం ఇచ్చారు.
38 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ
మరోవైపు ఎన్నికల్లో పరాజయంపై డీఎంకేలో తీవ్ర ఆత్మపరిశీలన ప్రారంభమైంది. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని అధ్యయనం చేయడానికి 38 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని స్టాలిన్ నియమించారు. ఈ కమిటీ ప్రతి నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరించి, ఎక్కడ లోపాలు జరిగాయో తెలుసుకోనుంది. పార్టీపై విమర్శలు వచ్చినా అవి నిజాయితీగా నమోదు చేయాలని స్టాలిన్ కమిటీకి సూచించడం గమనార్హం.
జూన్ 5లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించిన స్టాలిన్, జూన్ చివరికి పార్టీ సంస్కరణలు చేపడతామని ప్రకటించారు. ఇది డీఎంకేలో పెద్ద మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు. ఎన్నికల్లో కేవలం 59 స్థానాలకు పరిమితమైన డీఎంకేకు ఇది భారీ దెబ్బగా మారింది. మరోవైపు సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం తొలి ఎన్నికల్లోనే 108 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ సహా మిత్రపక్షాల మద్దతుతో అధికారంలోకి రావడం రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది.
డీఎంకేకు అతిపెద్ద షాక్ స్టాలిన్ స్వయంగా తన కోలత్తూరు నియోజకవర్గంలో ఓడిపోవడమే. టీవీకే అభ్యర్థి వి ఎస్ బాబు చేతిలో 8795 ఓట్ల తేడాతో పరాజయం పాలవడం పార్టీ శ్రేణులను కుదిపేసింది. అంతేకాకుండా ఇప్పటివరకు డీఎంకేతో ఉన్న కాంగ్రెస్ కూడా టీవీకేకు మద్దతు ఇవ్వడం రాజకీయంగా స్టాలిన్‌కు మరో పెద్ద దెబ్బగా మారింది. ఒకవైపు అధికారంలో కొత్త ప్రభుత్వం స్థిరపడుతుండగా, మరోవైపు డీఎంకే తన బలం తిరిగి చాటుకునేందుకు సిద్ధమవుతోంది. సహకారం ఇస్తామంటూనే ఎదురుదాడికి సిద్ధమని స్టాలిన్ స్పష్టం చేయడంతో తమిళనాడు రాజకీయాల్లో రాబోయే రోజులు మరింత ఉద్రిక్తంగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
தஞ்சைத் தரணியில் அன்புச் சகோதரர் பூண்டி கலைவாணன் அவர்களின் இல்லத் திருமண விழாவில் கலந்துகொண்டு மணமக்களை வாழ்த்தினேன்.
— M.K.Stalin (@mkstalin) May 18, 2026
பூண்டி கிருஷ்ணசாமி அவர்கள், பூண்டி கலைச்செல்வன் அவர்கள் எனக் கழகத்துக்காகவே தம் வாழ்வை ஒப்படைத்துக் கொண்ட கழகக் குடும்ப விழா இது!
சிறிய இடைவெளிக்குப் பிறகு,… pic.twitter.com/TgpiFCxWxK














Click it and Unblock the Notifications