ఆ ఇద్దరికీ మంత్రి పదవులు ఖాయం, ఢిల్లీ కీలక మంత్రాంగం..!?
రేవంత్ ప్రభుత్వంలో మంత్రులు అయ్యేదెవరు. అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కావటంతో తెలంగాణలో మంత్రివర్గ ప్రక్షాళన.. పార్టీ పదవుల పైన కసరత్తు జరుగుతోంది. దీంతో, పలువురు ఆశావాహులు ఢిల్లీ బాట పడుతున్నారు. మంత్రి పదవుల కోసం లాబీయింగ్ జరుగుతోంది. కాగా.. ప్రస్తుత కేబినెట్ లో ఇద్దరి పదవులు కోల్పోవటం ఖాయమని తెలుస్తోంది. అదే విధంగా ముగ్గురికి కొత్తగా ఛాన్స్ దక్కనుంది. దీంతో.. కేబినెట్ లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇప్పుడు పార్టీలో ఆసక్తిని పెంచుతోంది.
తెలంగాణలో మంత్రివర్గ ప్రక్షాళన దిశగా కసరత్తు మొదలైంది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి కావస్తుండటం, క్యాబినెట్‌లో మూడు ఖాళీలు ఉండటంతో.. ఈసారి ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న స్థానాలతో పాటు, పనితీరు ఆధారంగా కొందరిని మార్చే అవకాశం ఉందన్న ప్రచారంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. సీనియర్ ఎమ్మెల్యేలతో పాటు సామాజిక, ప్రాంతీయ సమీకరణాల రీత్యా అవకాశం వస్తుందని భావిస్తున్న నేతలు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. ఈ విషయం తెలిసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హుటాహుటిన సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి తనకే అవకాశం కల్పించాలని గతంలో విన్నవించిన ఆయన.. మరోసారి తన ప్రయత్నాలను ముమ్మరం చేసేందుకు హస్తిన బాట పట్టారు. వీరిద్దరితో పాటు మరికొందరు ఆశావహులు కొంతకాలంగా ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు లాబీయింగ్ మొదలుపెట్టారు.

ఢిల్లీలో ఆశావాహుల లాబీయింగ్
కాగా, ఇప్పటికే మంత్రుల పని తీరు పైన హైకమాండ్ కు నివేదిక అందాయి. బీసీ వర్గం నుంచి డిప్యూటీ సీఎంగా అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన పైన హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక.. ప్రస్తుత కేబినెట్ లో ఒక మహిళా మంత్రితో పాటుగా మరో ఇద్దరు మంత్రులు పదవుల్లో కొనసాగటం పైనా చర్చలు సాగుతున్నాయి. అదే విధంగా కోదండరాం, విజయశాంతికి అవకాశం పైనా అంచనాలు వినిపిస్తున్నాయి. అదే విధంగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను కేబినెట్ లోకి తీసుకొని.. పొన్నంకు పీసీసీ పగ్గాలు ఇస్తారనే ప్రచారమూ సాగింది. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ ఆలోచనలు.. ప్రణాళికల మేరకే కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని చెబుతున్నారు. ఈ నెలాఖరు లోగా మంత్రివర్గ ప్రక్షాళన.. పార్టీ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి.. జూన్ 2న కొత్త పథకాలు.. హామీల అమలుతో పాలన వేగవంతం చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. దీంతో.. కేబినెట్ లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.













Click it and Unblock the Notifications