సీఎం ప్రమాణస్వీకార వేదికపై మాజీ సీఎం- కేరళలో అరుదైన సీన్..!
కేరళ రాజకీయాల్లో మరో అరుదైన సన్నివేశం ఇవాళ కనిపించింది. ఇప్పటికే రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన యూడీఎఫ్ అధినేతగా ఎంపికైన వీడీ సతీశన్ ( VD Satheesan).. వెంటనే తమ పార్టీకి చెందిన సీనియర్ నేతలతో పాటు ఇన్నాళ్లూ తాము పోరాడిన మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) ఇంటికి వెళ్లి కలిశారు. ఆప్యాయంగా పలకరించి తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. అయినా ముఖ్యమంత్రి ప్రమాణానికి రాజకీయ ప్రత్యర్థులు వస్తారా అనిపించింది. కానీ అది కేరళ.
ఎవరూ ఊహించని విధంగా తాజా మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్..ఇవాళ ముఖ్యమంత్రిగా వీడీ సతీషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలివచ్చారు. తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ సీఎంలు రేవంత్ రెడ్డి, సిద్దరా మయ్య, ఇతర నేతలు హాజరయ్యారు. దీంతో ఇదంతా ఓ కాంగ్రెస్ కార్యక్రమంలా కనిపించింది. కానీ అదే సమయంలో పినరయి విజయన్ ఎంటరయ్యారు.

సభా వేదిక కింద నుంచి పినరయి విజయన్ ను చూడగానే కాంగ్రెస్ నేతలు ఆప్యాయంగా ఆయన్ను సభా వేదికపైకి తీసుకొచ్చారు. దీంతో ఆయన కూడా వారితో పాటు వచ్చి సభా వేదికపై కూర్చొన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సీఎం పదవి జస్ట్ మిస్సయిన కేసీ వేణుగోపాల్ పక్కనే విజయన్ వచ్చి కూర్చొన్నారు. తన పక్కనే ఉన్న కాంగ్రెస్ నేతల్ని కూడా ఆయన పలకరించారు. ఏమాత్రం భేషజాలు లేకుండా తన రాజకీయ ప్రత్యర్థి సీఎం అవుతున్న కార్యక్రమానికి హాజరు కావడమే కాకుండా ఈ ప్రోగ్రామ్ పూర్తయ్యే వరకూ అక్కడే ఉండి వెళ్లడం ద్వారా విజయన్ కేరళ రాజకీయాల్లో మరో కీలక మార్పుకు కారణమయ్యారు.














Click it and Unblock the Notifications