బాబును ఇరికించేందుకు ఆ పార్టీలు కుమ్మక్కు: రేవంత్

Revanth Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ హయాంలో ఐఎంజి భారత్‌కు భూములివ్వడంపై హైకోర్టులో కేసులు వేయడంలో తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఒక్కటయ్యాయని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిది రేవంత్ రెడ్డి శనివారం విమర్శించారు. తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఏదో ఒక విధంగా ఇరికించడానికే జైలు కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు చెందిన వ్యక్తులు కలిసి హైకోర్టులో పిటిషన్లు వేశారని అన్నారు. టిఆర్ఎస్ నిర్వహిస్తున్న టివి ఛానల్‌లో డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి సేకరించిన సమాచారం ఆధారంగా జగన్ పార్టీకి చెందిన వ్యక్తులు, టిఆర్ఎస్‌కు చెందిన వ్యక్తులు ఈ పిటిషన్లు వేశారని, వారి ఉమ్మడి వ్యూహానికి ఇది నిదర్శనమన్నారు.

ఐఎంజీ భారత్ అనే సంస్థకు టిడిపి హయాంలో భూముల కేటాయింపుపై కాంగ్రె స్ నేతలు గతంలో వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు, హైకోర్టు గతంలోనే కొట్టివేశాయని, దానిని దాచిపెట్టి ఇప్పుడు మరో కారణం చూపిస్తూ ఈ పిటిషన్లు వేశారని రేవంత్ పేర్కొన్నారు. కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా చూపిస్తూ ఒక వ్యూహం ప్రకారం ఈ పిటిషన్లు వేశారని, అందులో భాగంగానే రాష్ట్ర హోం శాఖ కూడా గతంలో కొట్టేసిన పిటిషన్ల ప్రస్తావన తేకుండా సమాధానం ఇచ్చిందని ఆయన వెల్లడించారు.

తన ఆరోపణలకు మద్దతుగా ఆయన కొన్ని పత్రాలను కూడా విడుదల చేశారు. టిఆర్ఎస్ పార్టీ టీవీ ఛానల్‌ను నిర్వహిస్తున్న తెలంగాణ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో గండ్ర మోహన రావు ఒక డైరెక్టర్ అని, ఐఎంజి భారత్ సంస్థకు భూ కేటాయింపుల వ్యవహారంపై ఆయన సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసి కొంత సమాచారం సేకరించారని, దాన్ని ఆధారంగా చేసుకొని జగన్ కేసుల్లో సహ నిందితుడిగా ఉన్న విజయ సాయి రెడ్డి, వారికి సన్నిహితుడైన ఏబికె ప్రసాద్ హైకోర్టులో పిటిషన్ వేశారన్నారు.

అదే సమాచారంతో శ్రీ రంగారావు అనే న్యాయవాది మరో పిటిషన్ వేశారన్నారు. అయితే, ఇదే భూ కేటాయింపు ఆరోపణలపై కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి 2004లో ఎసిబి కోర్టులో పిటిషన్ వేశారని, దానిని ఆ కోర్టు కొట్టివేసిందని, దానిపై 2006లో హైకోర్టులో అప్పీలు చేశామన్నారు. భూముల కేటాయింపులో దురుద్దేశం ఏదీ కనిపించడం లేదంటూ హైకోర్టు కూడా దానిని కొట్టివేసిందన్నారు. కానీ, ఇప్పుడు వేసిన పిటిషన్లలో గతంలో కొట్టివేసిన కేసుల ప్రస్తావన తేలేదని, అప్పట్లో ఈ వ్యవహారంలో విచారణ జరపాలని సిబిఐని కోరితే తమకు సిబ్బంది, నిధులు లేవని ఆ సంస్థ నిరాకరించిందన్నారు.

ఆ కారణాన్ని చూపిస్తూ ఇన్నేళ్ళ తర్వాత మళ్లీ సబిఐకి ఆదేశం ఇవ్వాలని కోరుతూ ఈ పిటిషన్లు వేశారని తెలిపారు. ఈ పిటిషన్లో ఎక్కడా చంద్రబాబును ప్రతివాదిగా చేర్చకుండా జాగ్రత్త తీసుకొని... కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మాత్రం ప్రతివాదులుగా పెట్టారని ఆయన చెప్పారు. కొద్ది రోజుల కింద వైయస్విజయమ్మ హైకోర్టులో చంద్రబాబుపై వేసిన పిటిషన్లో కూడా ఈ భూముల కేటాయింపే ప్రధాన ఆరోపణ అని, దాన్నీ హైకోర్టు కొట్టివేసిందని, దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా.. మకిలి అంటిన చేతులతో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారంటూ కొట్టివేసిందన్నారు.

ఇవేవీ ఇప్పుడు హైకోర్టు దృష్టికి తేలేదన్నారు. రాజకీయ కారణాలతో పిటిషన్లు వేస్తే ప్రభుత్వం ఆ విషయాలను కోర్టులో చెప్పాలని, కానీ చెప్పలేదని, టిడిపిని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్, జగన్ పార్టీ, టిఆర్ఎస్ కలిసి ఇలా దొంగ దెబ్బలకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఐఎంజీ భారత్‌కు ఇచ్చిన భూములను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వెనక్కు తీసేసుకొందని, ఆ సంస్థ ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తోందని, ఆ భూములు ఇప్పుడు ఆ సంస్థ వద్ద లేవని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+