వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ వ్యూహం ఫలిస్తుందా: తెలంగాణపై తేలుస్తారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
న్యూఢిల్లీ: తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యూహం ఫలిస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే, తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానంలో మాత్రం కొంత కదలిక వచ్చింది. జాతీయ మీడియా వార్తాకథనాలను పరిశీలిస్తే తెలంగాణపై స్పష్టత ఇవ్వడానికే కాంగ్రెసు అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30వ తేదీలోగా కేంద్రం నుంచి తెలంగాణపై ఏదో ఒక ప్రకటన రావచ్చునని అంటున్నారు. తెలంగాణపై ఈ నెల 29వ తేదీ సానుకూల ప్రకటన వస్తుందని మాజీ మంత్రి శంకరరావు హైదరాబాదులో అన్నారు. తెలంగాణ మార్చ్ అవసరం లేదని కూడా ఆయన అన్నారు.

అయితే, శంకరరావు మాటలను నమ్మడానికి అంతగా వీలు కాదని అనేవారు చాలా మందే ఉన్నారు. అయితే, ఏం జరగకపోతే కెసిఆర్ ఢిల్లీలో ఎందుకుంటారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనడాన్ని బట్టి తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని బయటపెడుతున్నాయి. తెలంగాణపై నిర్ణయం అంత సులభం కాదంటూనే ఆయన ఆ మాటన్నారు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం పెద్దలతో కెసిఆర్ చర్చలు జరుపుతున్నట్లే అందరూ భావిస్తున్నారు. ఆయన వాయలార్ రవి, ఆస్కార్ ఫెర్నాండెజ్‌లతో చర్చలు జరిపిన విషయం మాత్రమే బయటకు వచ్చింది. కానీ, ఆయన కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను కూడా కలిసినట్లు ప్రచారం జరుగుతోంది.

చైనా పర్యటనలో ఉన్న వాయలార్ రవి శనివారం ఢిల్లీ వస్తున్నారు. ఆ తర్వాత ఆయన కేరళకు వెళ్తున్నట్లు సమాచారం. ఆయన కేరళ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కెసిఆర్‌తో చర్చలు జరుపుతారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు వస్తే పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తానని కెసిఆర్ చేసిన ప్రతిపాదనపైన ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణపై నిర్ణయం ఖాయమనే మాట వినిపిస్తోంది.

ఈ నెల 30వ తేదీలోగానే తెలంగాణపై అటో ఇటో తేల్చేయడం అంత సులభం కాదనే మాట కూడా వినిపిస్తోంది. రాష్ట్రానికి చెందిన అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం వంటి చర్యలకు కేంద్రం పూనుకుంటుందా అనే మాట కూడా వినిపిస్తోంది. తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేయించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కాంగ్రెసు అధిష్టానం ప్రధానంగా దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. అందుకు ఏ విధంగా ముందడుగు వేయాలనేది ఇప్పుడు కాంగ్రెసు ముందున్న సమస్యగా చెబుతున్నారు.

అయితే, తెలంగాణపై తాము నిర్ణీత కాలవ్యవధిలో నిర్ణయం తీసుకుంటామని చెబుతూ అందుకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తుందా అనేది కూడా తెలియడం లేదు. అయితే, తెరాస మాత్రం తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వెలువడుతుందనే విశ్వాసంతో ఉంది. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన స్థితి వచ్చిందని మాత్రం కాంగ్రెసు అధిష్టానం కచ్చితమైన అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి తెలంగాణపై తేల్చేయక తప్పదని భావిస్తున్నారు. తెలంగాణ అంశానికి, రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు కూడా ముడిపెడుతున్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే సమయంలోనే నాయకత్వ మార్పుపై దృష్టి పెడతారని చెబుతున్నారు. మొత్తం మీద, తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం సీరియస్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
It is said that Telangana Rastra samithi (TRS) president K chandrasekhar Rao has succeded in getting results on Telangana issue from Congress high command. It is learnt that Sinia Gandhi has decided to take decission Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X