కెసిఆర్ మాటలు ఉత్తవేనా: తెలంగాణపై ఆజాద్ షాక్?

కెసిఆర్‌తోనే కాదు, అందరితోనూ మాట్లాడుతున్నామని అంటూ ఆజాద్ కెసిఆర్‌తో జరిపిన చర్చల ప్రాధాన్యాన్ని తగ్గించి చూపే ప్రయత్నం చేశారు. ఢిల్లీకి వచ్చిన ఎవరితోనైనా తాము మాట్లాడుతామని, వచ్చినవారితో మాట్లాడుతున్నామని మరో మాట కూడా అన్నారు. అంటే, కెసిఆర్ తనంత తానుగా వస్తే అందరితో మాట్లాడినట్లుగానే కెసిఆర్‌తో మాట్లాడామనే పద్ధతిలో వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు లేదా తెలంగాణకు సంబంధించి ఢిల్లీలో ముఖ్యులు గులాం నబీ ఆజాద్, సుశీల్ కుమార్ షిండే, వాయలార్ రవి.
ఈ ముగ్గురు కేంద్ర మంత్రులు కూడా తెలంగాణపై ఇప్పట్లో నిర్ణయం సాధ్యం కాదనే పద్ధతిలోనే మాట్లాడారు. ఏకాభిప్రాయం కుదరకపోవడమే పెద్ద ఆటంకంగా చెబుతున్నారు. కెసిఆర్‌తో తాను చర్చలు జరపలేదని సుశీల్ కుమార్ షిండే చెప్పగా, కెసిఆర్‌తో చర్చలకు అంత ప్రాధాన్యం లేదనే పద్ధతిలో వాయలార్ రవి, ఆజాద్ మాట్లాడారు. అయితే, తాను మరో విడత చర్చల కోసం దసరా లోపు ఢిల్లీ వెళ్తానని కెసిఆర్ చెబుతున్నారు.
అయితే, గడువులు పెడుతున్నప్పటికీ అసలు విషయం కెసిఆర్‌కు కూడా తెలుసునని అంటున్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదని ఆయన కూడా ఓ అభిప్రాయానికి వచ్చారట. ఎప్పటికప్పుడు కాంగ్రెసు అధిష్టానాన్ని చిరాకు పరుస్తూ చర్చలు జరుపుతూ తెలంగాణను సాధించుకోవాలనేది ఆయన ఎత్తుగడగా చెబుతున్నారు. ఆందోళనల ద్వారా కాంగ్రెసు పెద్దలపై ఒత్తిడి తెస్తూనే చర్చలు జరుపుతూ పోవాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.
కాంగ్రెసు అధిష్టానం మాత్రం 2014 ఎన్నికలకు ముందు తెలంగాణపై తన నిర్ణయాన్ని వెల్లడించే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. అప్పుడైతే యుపిఎ ప్రభుత్వానికి ఏ విధమైన ముప్పు ఉండదని అనుకుంటోందని చెబుతున్నారు. అయితే, తెలంగాణపై నిర్ణయాన్ని వెలువరించకుండా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధపడినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. కెసిఆర్‌కు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకుల్లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి నుంచి మరెవరి నుంచీ మద్దతు లభించడం లేదు. కెసిఆర్ నోరు విప్పి బహిరంగంగా ముందుకు వస్తే తప్ప అసలు విషయం తెలిసేట్లు లేదు.












Click it and Unblock the Notifications