జగన్‌కు మళ్లీ 'వైయస్ విజయమ్మ బైబిల్' చిక్కులు

జగన్ సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో విజయమ్మ బైబిల్ చేబూనటం వివాదస్పదమైంది. రాజకీయ కార్యక్రమాలలో ఆమె బైబిల్‌ను ఎలా తీసుకు వస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. అది ఒకరకంగా మత ప్రచారమేనని వారు ఆరోపిస్తున్నారు. బైబిల్ చేతపట్టుకొని రాజకీయ యాత్రలకు రావడం ద్వారా విజయమ్మ ఆ వర్గాన్ని తమ వైపుకు రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారనేది వారి ఆరోపణ.
రెండు రోజుల క్రితం కూడా టిడిపి విజయమ్మ బైబిల్ పట్టుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విజయమ్మ మాత్రం బైబిల్ రాజకీయాలను ఖండించారు. తాను ఎక్కడా మత ప్రచారం చేయలేదని, తనకు మత ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదని ఆమె మీడియా సమావేశంలో అన్నారు. తాను ఎక్కడకు వెళ్లినా బైబిల్‌ను తీసుకు వెళ్తానని, బైబిల్ చేతిలో ఉంటే ధైర్యంగా ఉంటుందన్నారు. అంత మాత్రాన తాను మత ప్రచారం చేసినట్లు కాదని ఆమె చెప్పారు.
తన మతం మానవత్వమని ఆమె చెప్పారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, ఏ మతానికి తాను వ్యతిరేకం కాదన్నారు. తన భర్త దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మనుషులను ప్రేమించడమే తనకు నేర్పించారని చెప్పారు. తన భర్త చనిపోయి, తన కొడుకు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళితేనే తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్నారు. అయితే ఆమె ఈ వార్తలను ఖండించిన తర్వాత టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ విజయమ్మ ప్రచారం చేసిందంటూ ఓ సిడిని విడుదల చేశారు.
విజయమ్మ గతంలో కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేనేత దీక్ష చేసినప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ఆమె దీక్ష చేసిన సమయంలో ఆమె చేతిలో బైబిల్ ఉంది. దీనిపై టిడిపి అప్పుడు కూడా ప్రశ్నించింది. దీక్షలు, ధర్నాల పేరుతో విజయమ్మ మత ప్రచారం చేస్తున్నారని, ఆ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. షర్మిల దీక్షలో విజయమ్మ బైబిల్‌తో కనిపించడం మరోసారి వివాదానికి దారి తీసింది.












Click it and Unblock the Notifications