షర్మిలకు జ్వరం: యాత్ర కుదింపు, సిఎం భార్యపై వ్యాఖ్య
అనంతపురం: గత తొమ్మిది రోజులుగా మరో ప్రజా ప్రస్థానం పేర పాదయాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల జ్వరంతో బాధపడుతున్నారు. ఆమెకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆమె పాదయాత్ర అనంతపురం జిల్లాలో సాగుతున్న విషయం తెలిసిందే. పాదయాత్రకు విరామం ఇవ్వాలని వైద్యులు ఆమెకు సూచించారు.

వైద్యుల సలహాను వినడానికి షర్మిల నిరాకరించారు. దీంతో ఆమె పాదయాత్రను శనివారంనాడు ఆరు కిలోమీటర్లకు కుదించారు. నిజానికి, షెడ్యూల్ ప్రకారం 13.8 కిలోమీటర్లు నడవాల్సి ఉంది. ముందు నిర్ణయించిన ప్రకారం అంపాపురం వద్ద ఆమె శనివారం బస చేయాల్సి ఉంది. యాత్ర కుదింపుతో వసంతపురం వద్ద యాత్ర ముగించి విశ్రాంతి తీసుకుంటారు.
అనంతపురం జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న షర్మిల శనివారం బుడంగపల్లెలో మహిళలతో సమావేశమయ్యారు. వారు ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసుకునేందుకు రచ్చబండ నిర్వహించారు. తమ ప్రాంతంలో మంచినీటి ఎద్దడి ఉందని మహిళలు షర్మిలతో చెప్పారు. ముఖ్యమంత్రి భార్య కూడా 3 కిలోమీటర్లు నడిచి మంచినీరు తెచ్చుకుంటే తప్ప ముఖ్యమంత్రి ప్రజల బాధ తెలుసుకోలేరని షర్మిల ఈ సందర్భంగా అన్నారు.
క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నిక్షేపంగా ఉన్నారని, ఇక్కడ ప్రజలు మాత్రం కష్టాలు పడుతున్నారని ఆమె అన్నారు. పదో రోజు శనివారం తన పాదయాత్రను అంతకు ముందు షర్మిల గొల్లపల్లిలో ప్రారంభించారు. అక్కడి నుంచి బడంగపల్లికి చేరుకుని వేరుశనగ పంటలను పరిశీలించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications