జగన్‌పై ఫైర్: ఇటు కిరణ్ రెడ్డి, అటు చంద్రబాబు

జగన్ సంస్థల్లోకి వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయనే విషయంపై కోర్టులు విచారణ విచారణ జరుపుతున్నాయని, సిబిఐ దర్యాప్తు చేస్తోందని, వాటికి సమాధానం చెప్పకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన నాయకులు కాంగ్రెసు పార్టీని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు అధిష్టానం జగన్‌ను జైలుకు పంపించిందని షర్మిల, విజయమ్మ తప్పు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్ తెర వెనక బాగోతాలతో తమకు సంబంధం లేదని అన్నారు. జగన్ సంస్థల్లోకి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పరోక్షంగా వచ్చాయని ఆయన అన్నారు.
వైయస్ జగన్ ఎవరి కోసం పోరాడి జైలుకు వెళ్లారని ఆయన అడిగారు. రైతుల కోసమా, మహిళల కోసమా, ఎస్సీ ఎస్టీల కోసమా, విద్యార్థుల కోసమా, ఎవరి కోసం జగన్ పోరాడారని ప్రశ్నించారు. జగన్ వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ఆయన అడిగారు. ప్రజాస్వామ్యానికి అటువంటి నాయకుడు అవసరమా అని ఆయన అన్నారు. జగన్ జైలులో ఎందుకున్నాడో ప్రజలే ఆలోచించుకోవాలని అన్నారు.
సంగారెడ్డిలో జరిగిన తన సభలు కుర్చీలు ఖాళీ అయ్యాయని ఓ మీడియా ప్రచారం చేసిందని, రాష్ట్రంలో పది చానెళ్లు ఉన్నాయని, పది పది రకాలుగా చెబుతున్నాయని, తమకు ప్రజలే మీడియా అని ఆయన అన్నారు. కాంగ్రెసు కార్యకర్తలే తమకు చానెళ్లని, ప్రజలే పత్రికలని అన్నారు. తమకు సొంత పత్రికలు, చానెళ్లు లేవని కిరణ్ కుమార్ అన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో వస్తున్నా.. మీకోసం పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు అటు కాంగ్రెసు పార్టీని, ఇటు వైయస్ జగన్‌ను విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి తన ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడ్డారని, అవినీతికి పాల్పడి వైయస్ కుమారుడు జగన్ జైలులో ఉన్నారని ఆయన అన్నారు. జగన్ ఒక్కడే 43 వేల కోట్ల రూపాయలకు అభివృద్ధి చెందాడని సిబిఐ చెబుతోందని ఆయన అన్నారు. ఆ సొమ్మును రాష్ట్రమంతా పంచుకుంటే ఎంతెంత వస్తుందో ఆలోచించాలని ఆయన అన్నారు.
తమది పేదల పార్టీ అని, ఈ పేదల పార్టీని తుడిచిపెట్టడానికి కాంగ్రెసు పార్టీ కుట్రలు చేస్తోందని ఆయన విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలతో కాంగ్రెసు కుమ్మక్కయి తమ పార్టీని దెబ్బ తీయాలని చూస్తోందని ఆయన అన్నారు. తినీ తినీ కాంగ్రెసు నాయకులు లావు అవుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
శానససభ్యులను కొనుగోలు చేయడానికి వైయస్ జగన్ జైలు నుంచే ప్లాన్ చేస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జగన్ అవినీతి సొమ్మును జప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ ఒప్పందంతో రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటేసిందో చెప్పాలని ఆయన అడిగారు. కాంగ్రెసును అడ్డుకుంటేనే తెలంగాణ వస్తుందని అన్నారు. తెలంగాణ జెఎసి అన్ని పార్టీలను కలుపుకుని వెళ్లాలని, జెఎసికి తాము సంఘీభావం తెలుపుతున్నామని అన్నారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తే తాము తెలంగాణపై తేల్చేస్తామని దయాకర్ రావు చెప్పారు.












Click it and Unblock the Notifications