జగన్‌తో దోస్తీ: మజ్లిస్‌తో తాడోపేడో, కిరణ్ అర్థమదేనా?

Kiran Kumar Reddy-Asaduddin Owaisi
హైదరాబాద్: మజ్లిస్ పార్టీని బుజ్జగించే చర్యలను కాంగ్రెసు పార్టీ ఆపనుందా? ఆ పార్టీతో తాడోపేడో తేల్చుకోనుందా? ఎదురుదాడికి దిగనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి, కేంద్రంలో యూపిఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ పత్రికా ముఖంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

అప్పటి నుండి ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెసు పార్టీ ప్రయత్నించింది. పలువురు నేతలు రంగంలోకి దిగి అసదుద్దీన్‌ను నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. పార్టీ ఎంపీ ఎంఏ ఖాన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీలు ఫోన్ చేసి మజ్లిస్ నేతలను బుజ్జగించారు. అయినా వారు వెనక్కి తగ్గలేదు. ఈ రెండు రోజులు కూడా కాంగ్రెసు వారి సంప్రదింపులు కొనసాగించింది. అయితే మజ్లిస్ ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదు.

ఇందుకు రెండు కారణాలు అని కాంగ్రెసు భావిస్తోంది. రాష్ట్రంలో తమ పట్టు పెంచుకునేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి వెళ్లేందుకు మజ్లిస్ నిర్ణయానికి వచ్చిందని భావించడం ఒకటి కాగా హైదరాబాదులోని మహావీర్ ఆసుపత్రి స్థలం కోసమే భాగ్యలక్ష్మి ఆలయం విషయంలో రగడ సృష్టించారనేది రెండోది. ఈ జగన్, మహావీర్ ఆసుపత్రి స్థలం కోసమే ఉద్దేశ్య పూర్వకంగా మజ్లిస్ తమకు మద్దతు ఉపసంహరించుకుందని భావిస్తోంది.

దీంతో మజ్లిస్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే పరిస్థితి లేదని కాంగ్రెసు భావిస్తోంది. అయినప్పటికీ ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతోంది. ఓ వైపు సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు మజ్లిస్ వెనక్కి తగ్గని పక్షంలో తెగతెంపులకు కూడా రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సంప్రదింపులతో తగ్గిందా ఓకే. లేదంటే ఇక ఎదురుదాడికి దిగాలని భావిస్తోందని అంటున్నారు. అందుకోసం వ్యూహరచన కూడా చేస్తోందట. మజ్లిస్‌ను టార్గెట్ చేసేందుకు ముస్లిం నేతలను కాంగ్రెసు రంగంలోకి దింపనుందట. స్వార్థంతోనే మజ్లిస్ మద్దతు ఉపసంహరించుకుందని కాంగ్రెసు ఎదురు దాడి చేయనుందట.

కిరణ్ వ్యాఖ్యల అర్థమదేనా?

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తదితరుల వ్యాఖ్యలు చూస్తుంటే మజ్లిస్‌తో తెగతెంపులకు కాంగ్రెసు సిద్ధపడ్డట్లుగా కనిపిస్తోంది. నిన్నటి వరకు మజ్లిస్ వ్యవహారంపై కూల్‌గా స్పందించిన నేతలు ఈరోజు(బుధవారం) ఘాటుగా స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బొత్స.. అసద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మహవీర్ ఆసుపత్రి స్థలం కోసమే మజ్లిస్ భాగ్యలక్ష్మి ఆలయం రగడను సృష్టించిందని మండిపడ్డారు. జగన్‌ మజ్లిస్‌కు కొత్త స్నేహితుడు కాదని పాత నేతనే అన్నారు. కిరణ్ కూడా ధీటుగానే స్పందించారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన బాలల దినోత్సవంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా మజ్లిస్ పార్టీని ఉద్దేశించినవే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

డబ్బు, పదవి, గౌరవం, కీర్తి శాశ్వతం కాదని చదువు ఒక్కటే శాశ్వతం అని కిరణ్ అన్నారు. మనం తీసుకున్న నిర్ణయం సరైనది అని భావిస్తే ఎవరికీ భయపడాల్సిన పని లేదని, భయపడుతూ బతికితే అది బతికే కాదన్నారు. మజ్లిస్ బెదిరింపులకు, బ్లాక్ మెయిల్‌కు లొంగే ప్రసక్తి లేదన్న భావనతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు. అదే సమయంలో నేతలు మజ్లిస్‌తో తాడోపేడో తేల్చుకోవడానికి అధిష్టానం మద్దతు కూడా ఉందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+