వైయస్, బాబుపై కెసిఆర్ నిప్పులు: జగన్ పార్టీ టార్గెట్

K Chandrasekhar Rao
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ తెలంగాణ ద్రోహులు అని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా పరిగిలో తెరాస బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడారు. 2004లో తెరాసతో పొత్తు పెట్టుకొని వైయస్ తెలంగాణవాదాన్ని బలహీనపర్చేందుకు తెరాస ఎమ్మెల్యేలను తమ వైపుకు లాక్కున్నారన్నారు. 2009లో చంద్రబాబు తెరాసతో పొత్తు పెట్టుకొని తెలంగాణపై యూ టర్న్ తీసుకున్నారన్నారు.

తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు అధికారం కోసమే పాదయాత్రలు చేస్తున్నారన్నారు. బిసిలకు ప్రాధాన్యం ఇచ్చింది తెరాసనే అన్నారు. బిసిలపై కాంగ్రెసు, టిడిపిలది కపట ప్రేమ అన్నారు. ఆ రెండు పార్టీలు ఇప్పుడు ఆపదమొక్కులు మొక్కుతున్నారన్నారు. తెలంగాణ కోసం తాము 12 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. తాము తెలంగాణనే కోరుకుంటున్నామన్నారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసులను నమ్మొద్దన్నారు.

రంగారెడ్డి జిల్లాలో సాగునీరు తెచ్చే బాధ్యత తనదే అన్నారు. కృష్ణా నది ఆంధ్రా అయ్య సొత్తు కాదని, అందులో మనకూ భాగస్వామ్యముందన్నారు. తెలంగాణ వస్తే మా బతుకులు మేం బతుకుతామని, మాకు రూపాయికి కిలో బియ్యం వంటి తాయిలాలు అవసరం లేదని కిరణ్ కుమార్ రెడ్డికి చురక వేశారు. వైయస్, చంద్రబాబు పాలనలో తెలంగాణ అభివృద్ధి జరగలేదన్నారు. చంద్రబాబు హయాంలో రైతుల్ని కాల్చి వేసి జైల్లో పెట్టారని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముస్లిం మైనార్టీలకు, బిసిలకు, అగ్రకులాల్లో పేదవారికి అండగా ఉంటామన్నారు. పేద విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తామన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల పిల్లలు ఇప్పుడు హైదరాబాదులో ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుకుంటున్నారని, తెలంగాణ వచ్చాక పేదవారి పిల్లలకు కూడా అలాంటి విద్య తన బాధ్యతే అన్నారు. తెలంగాణ ఇస్తే తెరాసను కాంగ్రెసులో విలీనం చేసేందుకు తాను సిద్ధపడ్డానన్నారు.

పాదయాత్రలో సీమాంధ్ర నేతలు చేస్తున్న ప్రచారం చూస్తే సిగ్గనిపిస్తోందన్నారు. ఒకరేమో రాజన్న రాజ్యం అంటారని, మరొకరేమో చంద్రన్న రాజ్యమంటారని షర్మిల పాదయాత్ర, చంద్రబాబు పాదయాత్రలను ఉద్దేశించి అన్నారు. ఈ రెండు రాజ్యాలే తెలంగాణను ముంచాయన్నారు. షర్మిల, చంద్రబాబు యాత్రలు దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. నక్కజిత్తుల బాబు రాజ్యం, రాజన్న రాజ్యం వద్దన్నారు. తెలంగాణ కోసం ఎక్కడి వరకైనా వెళ్దామన్నారు.

రాజకీయాలు వేగంగా మారుతున్నాయని, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తుమ్మితే ఊడితే ముక్కులాగా ఉందన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు బయటపడితే ప్రభుత్వం పడిపోతుందన్నారు. ఈ దశలో మనం పట్టుబిగించాల్సి ఉందన్నారు. సీమాంధ్ర గజ దొంగల్ని నమ్మొద్దన్నారు. చంద్రబాబు పార్టీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఈ పార్టీలను మొత్తం పారద్రోలాలన్నారు. 1956లో తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపారన్నారు.

తెలంగాణ విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టవద్దని కెసిఆర్ పోలీసులను కోరారు. కాగా కెసిఆర్ సమక్షంలో కొప్పుల హరీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+