సిద్ధంగా లేరా?: జగన్, చంద్రబాబు ఒకరిపై ఒకరు

తాము అవిశ్వాస తీర్మానం పెడితే బేరాసాలు ఆడి వైయస్ జగన్ జైలు నుంచి బయటపడాలని చూస్తున్నారని, వారి బేరసారాల కోసం తాము అవిశ్వాసం ప్రతిపాదిస్తామని, అవిశ్వాస తీర్మానం ఎప్పుడు ప్రతిపాదించాలో కూడా తెలియని వారు దాని గురించి మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. అవసరమైతే ప్రజల కోసం తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని ఆయన అన్నారు. దీన్ని బట్టి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి సిద్ధంగా లేరని అంటున్నారు. పైగా, శానససభా సమావేశాలను బహిష్కరించాలనే నిర్ణయం తీసుకోవడం ద్వారా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే విషయాన్ని దాటవేయాలని చూస్తోందని కూడా అంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి సిద్ధంగా లేదని, అందుకే తెలుగుదేశం పార్టీపై నిందలు వేస్తోందని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి తగిన సంఖ్యాబలం ఉన్నప్పటికీ, అది చర్చకు రావాలంటే 29 మంది శాసనసభ్యుల బలం అవసరం ఉంది. ఆ బలం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని కూడగట్టుకుని అవిశ్వాస తీర్మానాన్ని ముందుకు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అదే సమయంలో మజ్లీస్‌కు చెందిన ఏడుగురు సభ్యుల మద్దతు కూడా పొందవచ్చు.
కానీ, అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి, దాన్ని చర్చకు తీసుకుని వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సిద్ధంగా లేదని చెబుతున్నారు. వైయస్ జగన్ జైలులో ఉండడంతో ముందస్తు ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి సన్నాహాలు చేసుకోవడం కష్టమవుతుందని వైయస్సార్ కాంగ్రెసు నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాతనే ఎన్నికలను ఎదుర్కోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చూస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉందనే మరో వాదన కూడా వినిపిస్తోంది.
కాగా, తెలుగుదేశం పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదు. అటు సీమాంధ్రలోనూ ఇటు తెలంగాణలోనూ ఆ పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగా లేదు. చంద్రబాబు పాదయాత్ర ద్వారా పరిస్థితి కాస్తా మెరుగుపడుతుందని అనుకుంటున్నారు. అదే సమయంలో జగన్ జైలులో ఉన్న స్థితిలో మరింత కాలం పోతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై ప్రజల్లో ఆదరణ తగ్గుతుందని అనుకుంటోంది. దాంతో ఇప్పటికిప్పుడు ఆ పార్టీ వ్యవస్థాగతమైన పటిష్టతపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే ఉందని, ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పరిస్థితి కూడా అంతేనంటున్నారు. చర్చల పేరుతో ఇంతకాలం సమయం వృధా చేశారనే వ్యతిరేకత ఆ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖర రావుపై ఉందని అంటున్నారు. దీంతో పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు కెసిఆర్ కొంత సమయం తీసుకోవాలని అనుకుంటున్నారని, దూరమైన శ్రేణులను దగ్గర చేసుకునేందుకు ఆయన ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టారు. పరిస్థితిని తనకు తిరిగి అనుకూలంగా మలుచుకునేందుకు వీలుగా పరిస్థితిని మలుచుకునే ఉద్దేశంతో ఉన్నారు. ప్రతిపక్షాలు ఆ స్థితిలో ఉండడం వల్లనే కాంగ్రెసు నాయకులు తమకు ఏ మాత్రం డోకా లేదనే ప్రకటనలు చేస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications