హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షర్మిల దిష్టిబొమ్మ దగ్ధం: తెరాస నేతల అల్టిమేటమ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sharmila
హైదరాబాద్/ మహబూబ్‌నగర్: తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైఖరిని స్పష్టం చేసిన తర్వాతనే తెలంగాణలో అడుగు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు షర్మిలకు అల్టిమేటమ్ ఇచ్చారు. వైయస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణ ప్రజలపై ఏ మాత్రం ప్రేమ ఉండేది కాదని, వైయస్ ప్రేమంతా తెలంగాణ భూములపైనా ఓట్లపైనే అని తెరాస నాయకులు జితేందర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి గురువారం మీడియా ప్రతినిదుల సమావేశంలో అన్నారు. మహాకూటమి గెలిస్తే పోతిరెడ్డిపాడును మూసేసి రాయలసీమకు నీళ్లు రాకుండా చేస్తారని అప్పట్లో వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారని వారు గుర్తు చేశారు.

వైయస్ రాజశేఖర రెడ్డి మాటలపై సమాధానం చెప్పాలని వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను డిమాండ్ చేశారు. వైయస్ జగన్ ఏం చేసి జైల్లో ఉన్నారో చెప్పాలని కూడా వారు వైయస్ విజయమ్మను అడిగారు. తెలంగాణ ప్రజలు సీమాంధ్ర రాజ్యం వద్దంటున్నారని, తెలంగాణ రాజ్యం కావాలంటున్నారని వారన్నారు. పార్లమెంటులో సమైక్యాంధ్ర ప్లకార్డులు ప్రదర్శించి వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది వైయస్ జగన్ కాదా అని అడిగారు.

యోగి వేమన విశ్వవిద్యాలయానికి ఇచ్చిన నిధుల్లో పది శాతం నిధులను కూడా తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు వైయస్ రాజశేఖర్ రెడ్డి తన పాలనలో ఇవ్వలేదని వారు విమర్శించారు. పోతిరెడ్డిపాడు నుంచి వైయస్ రాజశేఖర రెడ్డి అక్రమంగా నీటిని తీసుకుని వెళ్లారని విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు వైయస్ చేసిన మోసం అంతా ఇంతా కాదని వారన్నారు. తెలంగాణ భూములను దోచుకుంది వైయస్ హయాంలోనే అని వారు ఆరోపించారు. వైయస్ మోసాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరని అన్నారు.

తెలంగాణ ప్రజలకు వైయస్ ఎల్లవేళలా అన్యాయమే చేశారని వారు విమర్శించారు. తెలంగాణ ప్రజలకు వైయస్సార్ కాంగ్రెసు ఏం చేయబోతుందో చెప్పాలని అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్సించారని, వైయస్‌కు తెలంగాణ భూములూ వనరుల మీదనే ప్రేమ అని, వైయస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్నే జగన్ కొనసాగిస్తున్నాడని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్రం మోసం చేసిన మాట నిజమేనని, అయితే ఒక రాజకీయ పార్టీగా తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన వైఖరి చెప్పాల్సిన అవసరం ఉందని వారన్నారు.

రాజన్న రాజ్యం కావాలని పాదయాత్ర చేస్తున్న షర్మిలను తెలంగాణలో అడుగు పెట్టనివ్వబోమని పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులు అన్నారు. తెలంగాణలోకి ప్రవేశించే ముందు తెలంగాణపై షర్మిల స్పష్టమైన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయం ముందు రహదారిపై షర్మిల దిష్టిబొమ్మను విద్యార్థులు దగ్ధం చేశారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారు ధర్నాకు దిగారు. దీంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

English summary
Palamoor university students burnt effigy of YSR Congress president YS Jagan's sister Sharmila, opposing her padayatra in Telangana. TRS leaders Jitender Reddy and Niranjan Reddy demanded sharmila clarity on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X