జగనొస్తే తెలంగాణ నోట్లో మట్టి, మర్సిపోలేదు: కెసిఆర్

సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన పార్టీ బహిరంగ సభలో కెసిఆర్ ప్రసంగించారు. చంద్రబాబు, జగన్‌లపై కెసిఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు మోసానికి పెట్టింది పేరని, దగాకోరు నక్కజిత్తుల చంద్రబాబు ప్రజలను మోసగించేందుకే మళ్లీ యాత్రలు చేస్తున్నారని అన్నారు. జగన్ పార్లమెంట్‌లో సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకున్న సంఘటనను తెలంగాణ ప్రజలు ఇంకా మరిచిపోలేదని కెసిఆర్ అన్నారు. ఈ నెల 28న ఈ రెండు పార్టీల రంగులు బయటపడతాయని, తెలంగాణపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే అనుకూలంగా తీర్మానం చేసి ఏకవాక్య లేఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి వంద అసెంబ్లీ సీట్లు, 16 ఎంపీ సీట్లు ఇస్తే తెలంగాణ దానంతట అదే వస్తుందని ఆయన అన్నారు. మన నీళ్లు, ఉద్యోగాలు, భూములు, ఆస్తులు దోచుకోవడానికే బాబు పాదయాత్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చిల్లరబుద్ది చూపుతున్నారని, బర్రె కనబడితే బర్రెకు, గొర్రె కనపడితే గొర్రెకు బీమా ఇస్తామని చెబుతున్నాడని అన్నారు. ఏదో ఒకటి చెప్పి తిమ్మిని బమ్మిచేసి ఓట్లు వేయించుకోవడానికి చంద్రబాబు పాకులాడుతున్నాడని అన్నారు.
చంద్రబాబు రైతులకు రుణమాఫీ పేరుతో మరో డ్రామా ఆడుతున్నాడని కెసిఆర్ అన్నారు. తెలంగాణ రైతుకు ఆయన ఇచ్చేదేంటని ప్రశ్నించారు. రాష్ట్రానికి తెలంగాణ నుంచే మూడొంతుల ఆదాయం వస్తోందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఈ ప్రాంత రైతులకు లక్ష వరకు పంట రుణాలను మాఫీ చేస్తానని అన్నారు. చేనేత కార్మికులకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఆలోచిస్తున్నామని, త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రకటిస్తామ ని చెప్పారు. ఇప్పుడు నడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ లేదని, తెలంగాణ ద్రో హులు ఆడే డ్రామాలను ఎవరూ నమ్మబోరని ఆయన అన్నారు.
ఆంధ్రోళ్లు ఇచ్చే చాక్లెట్లు, బిస్కెట్లకు, బెల్లం గడ్డలకు ఆశపడితే బానిస బతుకులు తప్పవని హెచ్చరించారు. సెటిలర్లను తాము కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని, కానీ వారు తెలంగాణవాదులపై దాడులకు తెగబడుతున్నారని, ఇలాగే జరిగితే వచ్చే తిరుగుబాటుకు వారే బాధ్యత వహించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications