పిక్చర్స్: అప్పుడు అంతా కెవిపినే, ఇప్పుడు స్ట్రగుల్
హైదరాబాద్: కెవిపి రామచందర్ రావుకు ముందు వెనకలూ అవసరం లేదు. కెవిపి అంటే చాలు, అందరూ ఇట్లే గుర్తు పట్టేస్తారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన ఓ వెలుగు వెలిగారు. వైయస్ రాజశేఖర రెడ్డిని వెనక నుంచి నడిపించిన నాయకుడిగా ఆయనకు గుర్తింపు వచ్చింది. వైయస్ రాజశేఖర రెడ్డి, కెవిపి వేర్వేరు కాదని, వైయస్సార్ శరీరం అయితే, కెవిపి ఆత్మ అని అంటారు. తాను వైయస్సార్ ఆత్మనని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత కెవిపి ప్రభలు కాంగ్రెసు పార్టీలో క్రమక్రమంగా తగ్గుతూ వచ్చాయి. వైయస్ మరణించిన తర్వాత కూడా ఆయన కాంగ్రెసులో కీలకమైన పాత్రను పోషించడానికి ప్రయత్నించారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా ఆయన ప్రధానంగానే కనిపించేవారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాస్తా తెరమరుగయ్యారు. ఇప్పుడు మళ్లీ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించడానికి సిద్ధపడుతున్నారు. ఈ నెల 16వ తేదీన భారీ యెత్తున జరిగే కాంగ్రెసు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాట్లపై ఆయన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి షబ్బీర్ అలీలతో కలిసి బొత్స సత్యనారాయణతో చర్చలు జరిపారు.
అయితే, కెవిపి రామచందర్ రావు ప్రాబల్యం కాంగ్రెసు అధిష్టానం పెద్దల వద్ద తగ్గినట్లు లేదు. ఆయన ఆ మధ్య వైయస్సార్ పాదయాత్ర అనుభవాల డైరీని ఆవిష్కరింపజేస్తే కాంగ్రెసు అధిష్టానం పెద్దలు వేదికను అలంకరించారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నేతలు చాలా మంది మాత్రం ఆయనను వ్యతిరేకిస్తున్నారు. అయినా సరే, గత పాత్రను మళ్లీ పోషించాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నట్లు కనిపిస్తున్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు కెవిపి రామచందర్ రావు పెద్దగా వెలుగులోకి రాలేదు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఆయన అత్యంత ముఖ్యమైన నాయకుడిగా మారిపోయారు. ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి క్యూ కట్టేవారంటే అతిశయోక్తి కాదు.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతి పనిలోనూ కెవిపి చేయి ఉండేది. వైయస్సార్ వెంట నీడలా ఉండేవాడు. తెర వెనక వ్యూహాలు కెవిపివైతే, తెర ముందు వాటిని అమలు చేసేది వైయస్సార్ అని అనేవారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఏం చేయాలో, ఏం చేయకూడదనే విషయాలపై మంత్రాంగమంతా కెవిపిదేనని అనేవారు.

వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన దర్పం కూడా ఎక్కువే ఉండేది. వైయస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి వేదిక ఏర్పాట్లను పరిశీలిస్తూ మిగతా పార్టీ ఎంపీలను తోడు పెట్టుకుని ఇలా దర్శనమిచ్చారు ఆయన.

వైయస్ మరణంతో కెవిపి పెద్ద దిక్కును కోల్పోయారు. ఆయన కుటుంబానికి ఆయనే రక్షగా నిలబడతారని అనుకున్నారు. వైయస్ పోయిన దిగులుతో ఉన్న ఆయన కుమారుడు వైయస్ జగన్‌తగ అన్నీ తానే అయి నడిపించాలని అనుకున్నారేమో.. కానీ జగన్ దారి వేరైంది. జగన్ వేరే పార్టీ పెట్టుకుంటే కెవిపి కాంగ్రెసులోనే ఉండిపోయారు.

వైయస్ మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కెవిపి కీలక భూమికనే పోషించారు. రోశయ్య వెంట కూడా నిరంతరం ఉండడానికి ఆయన ప్రయత్నించారు.

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కెవిపి చురుగ్గా వ్యవహరించడం లేదు. ఇటీవల ఆయన పార్టీలో చురుకైన పాత్ర నిర్వహించాలనే ప్రయత్నంలో పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. మంత్రి రఘువీరా రెడ్డి చేపట్టిన భగీరథ యాత్రలో పాల్గొని తన ప్రాముఖ్యాన్ని చాటుకున్నారు.

కెవిపికి అధిష్టానం పెద్దల వద్ద మంచి పలుకుబడి ఉందని అంటున్నారు. ఆ పలుకుబడితో తిరిగి చక్రం తిప్పాలనే యోచనలో ఆయన ఉన్నారని అంటారు. తన వ్యూహంలో కెవిపి ఏ మేరకు ఫలితం సాధిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications