ఢిల్లీ గ్యాంగ్ రేప్: సిఎంకు, షిండేకి సోనియా ఘాటు లేఖ

సోనియా గాంధీ మంగళవారం రాత్రి సఫ్దర్ గంజ్ ఆసుపత్రికి వెళ్లారు. బాధితురాలు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. సోనియా ఆసుపత్రిలో 15-20 నిమిషాలు ఉన్నారు. డాక్టర్లతో మాట్లాడారు. బాధితురాలి తల్లిదండ్రులను ఓదార్చారని కాంగ్రెసు పార్టీ జనరల్ సెక్రటరీ జనార్దన్ ద్వివేది చెప్పారు. బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు సోనియా గాంధీకి చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇలాంటి సంఘటనలను ఖండించడంతో సరిపెట్టకుండా వాటిని రూపుమాపే దిశలో పని చేయాలని షీలా దీక్షిత్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయమని, మన మెట్రో నగరాల్లో జరుగుతున్న ఇలాంటి సంఘటనలకు బాధ్యులు ఎవరని షిండేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ సంఘటన చాలా వికృతమైన నేరంగా ఆమె పేర్కొన్నారు.
మహిళల పట్ల ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆమె షిండేను కోరారు. మన సోదరీమణులు, తల్లులు, పిల్లలు మెట్రో నగరాల్లో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలతో అందరం భయకంపితులమవుతున్నామని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రికి లేఖలో సూచించారు.
కాగా ఢిల్లీ కీచక పర్వాన్ని నిరసిస్తూ బిజెపి ఎంపీలు పార్లమెంటు ఎదుట ఆందోళనకు దిగారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications