సీమాంధ్రలోనూ తెలంగాణ కూటమి విజయం: కెసిఆర్

టిఎంయు-ఈయు విజయం సాధించడంతో కెసిఆర్ నేతలను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో గులాబీ జెండా రెపరెపలాడిందన్నారు. సాధారణ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే పునరావృతం కావడం తథ్యమన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల్లో కూడా తెలంగాణ కూటమి విజయం సాధించిందన్నారు.
ఈ నెల 28న నిర్వహించే అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెసు, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలన్నారు. ఆ పార్టీలు అభిప్రాయం చెప్పినా చెప్పక పోయినా తెలంగాణ ప్రజలు మాత్రం నమ్మే ప్రసక్తి లేదన్నారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు అభిప్రాయం చెబితేనే తాము చెబుతామన్న పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో కెసిఆర్ విభేదించారు.
వారు చెబితే మేం చెప్తామనటం ఏంటన్నారు. తెలంగాణవాదం రాకెట్ స్పీడుతో దూసుకు పోతోందన్నారు. తెలంగాణ ద్రోహులకు సాధారణ ఎన్నికల్లోనూ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. టిఎంయు-ఈయు విజయం తెలంగాణ ఉద్యమం - తెలంగాణవాదం విజయమన్నారు. ముఖ్యమైన ఆర్టీసి, సింగరేణి, జిహెచ్ఎంసిలలో తెలంగాణవాదం జోరుగా వినిపిస్తోందన్నారు. తెలంగాణను ఇక యాచించి కాకుండా... శాసించి తెచ్చుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications